
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పట్టణంలోని సిక్కువాడిలో గత నెల 18న జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. సిక్కువాడిలోని అమ్మ మెస్‌లో వంట పని చేస్తున్న అన్నమనేని మంజులను ఆమె భర్త అన్నమనేని కొమురయ్య హత్య చేయాలని ప్రయత్నించాడు. హోటల్‌లోని పొయ్యిపై ఉన్న వేడి కూరను మంజుల మీద పోయడంతో ఆమె ముఖం, ఛాతి, వీపు భాగాల్లో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. హోటల్ యజమాని విజయ్ 108 అంబులెన్స్ ద్వారా మంజులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మంజుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాజన్న కేసు దర్యాప్తు చేపట్టారు. కొమురయ్యకు మొదటి నుంచి తన భార్యపై అనుమానం ఉండేది. అంతేకాకుండా, మంజుల గతంలో మహిళా పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ కారణంగా కొమురయ్య తన భార్యపై కక్ష పెంచుకుని ఆమెను చంపాలని ప్రయత్నించాడు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
నీట్ ర్యాంక్ రాదని యువతి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామానికి చెందిన జంగ పూజ (20) ఆదివారం నీట్ పరీక్ష రాసింది. ప్రభుత్వం విడుదల చేసిన కీ చూసుకుని ర్యాంక్ రాదనే మనస్తాపంతో సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పూజ 2023లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి నీట్‌పరీక్ష కోసం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంది. పరీక్ష సరిగా రాయలేదని మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. పూజ తల్లి జంగ జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కోతులా.. దొంగలా..?
శంకరపట్నం(మానకొండూర్): మండలంలో వరుస చోరీలతో జనం జంకుతుండగా.. తాజాగా కిరాణ దుకాణంలో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో దొంగలు పడ్డారని వ్యాపారి అనుమానం వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు మాత్రం కోతులు దూరాయని పేర్కొంటున్నారు. వివరాలు.. మండలంలోని కేశవపట్నం ఎస్సీ, బీసీ కాలనీలో సత్యనారాయణ అనే వ్యక్తి రెండురోజుల క్రితం కిరాణ దుకాణానికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం తాళం తీసి చూడగా దుకాణంలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ట్రెయినీ ఎస్సై సుమన్‌రెడ్డి సిబ్బందితో కలిసి పరిశీలించారు. కాగా, దుకాణం వెనక తలుపులకు గడియ పెట్టకపోవడంతో కోతులు దూరి వస్తువులను చిందరవందర చేశాయని, అలాగే బ్యాగ్‌లో ల్యాప్‌ట్యాప్ భద్రంగా ఉండడంతో కోతులు దూరినట్లు నిర్ధారణకు వచ్చారు. దుకాణంలో పడింది దొంగలు కాదని, కోతుల పడి వస్తువులు చిందవందర చేశాయని ట్రెయినీ ఎస్సై పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన గంట గణేశ్, నరాల కొమురయ్య సోమవారం రాత్రి వర్షంలో మోటార్‌సైకిల్‌పై వస్తుండగా కేశవపట్నంలో కిందపడి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరిని 108వాహనంలో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు.