
మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవరా?
కరీంనగర్‌అర్బన్: ‘ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదవాలని ప్రచారం చేస్తున్నారు సరే.. మరి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించరా’.. అంటూ ఓ విద్యార్థిని ప్రజావాణిలో ప్రశ్నించింది. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ఆసక్తికర సన్నివేశం నెలకొంది. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థి బామండ్ల అక్షర ప్రజావాణిలో వినతిపత్రం అందజేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, హాస్టల్స్ సరిగా ఉండాలన్నా, సరిపడా సిబ్బంది ఉండాలన్నా, విద్యార్థులకు మంచి చదువు రావాలన్నా, మంచి భోజనం అందాలన్నా ప్రభుత్వ అటెండర్ నుంచి కలెక్టర్ వరకు, వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు వారి పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లో చదివించాలని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలలో చదివినవారికే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులన్న నిబంధన తేవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ మరణాలు తగ్గాలన్న ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఫిర్యాదు మీకే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతున్నానని వివరించారు.