
పట్టుదలతో నాయకత్వ లక్షణాలు
కరీంనగర్: క్రమశిక్షణ, పట్టుదల, కృషి, కఠోరశ్రమతో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి, ప్రముఖ సినీనటి రెజీనా కాసాండ్రా పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని వీకన్వెన్షన్‌లో డెమొక్రటిక్ సంఘ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామీణ మహిళా సంఘం వార్షిక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ పమేలా సత్పతి, ప్రముఖ సినీనటి, డెమోక్రటిక్ సంఘ సహ వ్యవస్థాపకురాలు రెజీనా కాసాండ్రా, సంస్థ వ్యవస్థాపకుడు ఎంఆర్‌ఎస్‌కే చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అప్పుడే నాయకురాలిగా రాణిస్తారని తెలిపారు. గ్రామాల్లో అనధికారికంగా నిర్వహించే బెల్ట్‌షాపుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తామని అన్నారు. మహిళలు మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలల పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని సూచించారు. డెమొక్రటిక్ సంఘ సంస్థ ఏర్పాటు చేసిన మహిళా సంఘాలకు ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందిస్తామన్నారు. ప్రముఖ నటి, డెమొక్రటిక్ సంఘ సహ వ్యవస్థాపకురాలు రెజీనా కాసాండ్రా మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు అంటే స్టేజీ మీద మాట్లాడం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో అన్యాయాన్ని ఎదిరించాలని పిలుపునిచ్చారు. తమ సంఘం ఆధ్వర్యంలో గ్రామాల్లో మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన దాదాపు 25మంది మహిళా సంఘాల ప్రతినిధులు వివిధ సమస్యలపై మాట్లాడారు. మహిళలు విన్నవించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. డెమోక్రటిక్ సంఘ ట్రస్ట్ ప్రియ రాజీవ్, ప్రతినిధి షేక్ ఆయుబ్ అడిషనల్ డీఆర్‌డీవో సునీత పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలవాలి
కలెక్టర్ పమేలా సత్పతి, సినీనటి రెజీనా కాసాండ్రా