ప్రతీ వర్షపు నీటిచుక్క ఒడిసిపట్టాలి
● అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్ కార్పొరేషన్: రానున్న వర్షాకాలంలో కురిసే ప్రతీ నీటి చుక్కను ఒడిసిపట్టుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వర్షపు నీటి సంరక్షణకు ప్రణాళిక రూపొందించాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పురపాలక, నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. భూగర్భ జలాలు అడుగంటి పోతున్న తరుణంలో రాబోయే వర్షాకాలంలో వర్షపు నీటి సేకరణ, సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇండ్లలో నీటి సంరక్షణ చర్యలపై దృష్టి పెట్టాలన్నారు. వర్షపు నీరంతా నేలలోకి ఇంకేలా, ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి చేయాలని సూచించారు. భవన అనుమతుల సమయంలోనే ఇంకుడు గుంతల నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. చెరువులు, కుంటల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో జాలువారే వరద నీటిని భూగర్భంలోకి ఇంకేలా కందకాల తవ్వకం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పేయ్ మున్సిపల్ కమిషనర్లు, భూగర్భ జలశాఖ, నీటిపారుదల పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.
డివిజన్‌ల వారీగా బాధ్యతలు
ఇంకుడు గుంతలనిర్మాణం లక్ష్యంగా శుక్రవారం నుంచి నగరంలో అధికారులు సర్వే చేపట్టనున్నారు. నగర పాలకసంస్థలోని 60 డివిజన్‌లతో పాటు విలీన గ్రామాల్లో సర్వే నిర్వహించేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 20, 21,22,23, 40, 41, 42, 43, 53, 57, 58, 59,60 డివిజన్‌లతో పాటు కొత్తపల్లి బాధ్యతలను డీఈ లచ్చిరెడ్డి, ఏఈ భీమ్‌వర్ధన్,టీపీబీవో సయ్యద్ ఖాదర్, ఎస్‌ఐ కుమారస్వామి అప్పగించారు.అలాగే 14,15,16,17, 18,19,36, 37, 38,39,54, 55,56 డివిజన్‌లతో పాటు చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్‌లకు డీఈ శ్రీనివాస్, ఏఈ సల్మాన్‌ఖాన్,టీపీబీఓ నదియా ఇస్రత్, ఎస్‌ఐ గట్టు శ్రీనివాస్, 11,12,13,33,34,35 డివిజన్‌లకు డీఈ ఓంప్రకాశ్, ఏఈ గట్టు స్వామి, టీపీబీవో నవీన్‌కుమార్, ఎస్‌ఐ వై.శ్రీనివాస్‌లను ఇన్‌చార్జీలుగా నియమించారు. 1,2,3,4,5,24,25,26,27, 28,29,44 డివిజన్‌లతో పాటు, దుర్శేడ్, గోపాల్‌పూర్, బొమ్మకల్ బాధ్యతలు డీఈ అయ్యూబ్‌ఖాన్, ఏఈ గఫూర్, టీపీబీఓ సాయిచరన్, ఎస్‌ఐ మహేందర్‌లకు, 6,7,8,9,10, 30,31, 32, 45, 46, 47, 48, 49,50, 51,52 డివిజన్‌లను డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సతీష్, శ్రీధర్,నరోత్తంరెడ్డిలకు అప్పగించారు.


