మద్యం మత్తులో ఆత్మహత్య
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ శాంతినగర్‌లో మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఎలక్ట్రీషియన్ బండ మోహన్(35) మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని సంతోష్‌నగర్‌కు చెందిన బండ మోహన్ కొన్నిరోజులుగా శాంతినగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి మద్యం తాగివచ్చి భార్య మహేశ్వరితో గొడవపడ్డాడు. ఆ మత్తులో గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్యతోపాటు పిల్లలు శ్రీదీక్షిత్(12) శ్రీబృంద(11) ఉన్నారు. మృతుడి సోదరుడు బండ రవి ఫిర్యాదుతో ఎన్టీపీసీ ఎ స్సై ఉదయ్‌కిరణ్ కేసు నమోదు చేసుకొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మెట్‌పల్లి మండలం సత్తక్కపల్లి–రాజేశ్వర్‌రావుపేట శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్‌కు చెందిన చిట్టాపురపు రాము(33) ద్విచక్రవాహనంపై కమ్మర్‌పల్లి వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్డీసీ బస్సు రాము ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాము అక్కడికక్కడే మృతిచెందాడు.
భవనంపై నుంచి పడి ఒకరు..
జగిత్యాలక్రైం: స్థానిక పోచమ్మవాడలో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి కర్నాల అరుణ్ (40) మృతిచెందాడు. మెట్‌పల్లికి చెందిన అరుణ్ గురువారం పోచమ్మవాడలో ఉన్న తన అత్తగారింటికి వచ్చాడు. ఈనెల 23న అతని బావమరిది వివాహం ఉండగా గురువారం పోచమ్మ పండగ చేశారు. రాత్రి భోజనం చేసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి భవనంపై పడుకున్నారు. అర్ధరాత్రి భవనం దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో బలమైన గాయాలై మృతిచెందాడు. మృతుడి భార్య మనోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కిరణ్ తెలిపారు.
నేడు స్వగ్రామానికి వసలజీవి మృతదేహం
ధర్మపురి: దుబాయ్‌లో హత్యకు గురైన స్వర్గం శ్రీనివాస్ మృతదేహం కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కృషితో శనివారం గ్రామానికి తీసుకురానున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ తెలిపారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ మోడర్న్ బేకరీలో పని చేస్తున్నాడు. ఈనెల 11న పాకిస్తానీ చేతిలో శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో మృతి చెందిన మృత దేహాలు స్వదేశానికి రావడానికి నెలలు పడుతుందని, కానీ శ్రీనివాస్ మృత దేహాన్ని కేంద్ర మంత్రుల చొరవతో వారం రోజులకే శంశాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువస్తారని భాస్కర్ తెలిపారు.


