బీ–థర్మల్‌లో బదిలీల కలకలం
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం థర్మల్ పవర్ స్టేషన్(ఆర్‌టీపీఎస్–బీ) 62.5 మెగావాట్ల సామర్ధ్యం గల విద్యుత్ కేంద్రం మూతపడి పది నెలలు గడిచింది. ఈక్రమంలో శనివారం తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్, విద్యుత్ సౌధ నుంచి స్థానికంగా పనిచేసే 85 మంది ఉద్యోగులకు మూకుమ్మడి బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. ఇందులో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్‌ఎం) విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నారు. సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.విజేందర్‌తోపాటు ఓఅండ్‌ఎంకు చెందిన –72, ఇంజినీర్లు–11మంది, ఏడీఈలు–ఒకరు బదిలీ అయిన వారిలో ఉన్నారు. మరోరెండు రోజుల్లో రెండోజాబితాలో మిగతా విభాగాల ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు రానున్నాయనే ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు.. ఉద్యోగ విరమణకు మరో మూడేళ్ల వ్యవధి ఉండే వారిని బదిలీచేసే అవకాశం లేదని తెలుస్తోంది.
కాలంచెల్లిన జాబితాలో బీ–థర్మల్..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఉన్న రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ అనేక రికార్డుల సాధించింది. అరవై ఏళ్ల జీవితకాలం పూర్తవడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అప్పటి సాంకేతిక పరిజ్ఞానానికి సరిపడే విడిభాగాలు లభించడంలేదు. దీంతో గతేడాది జూన్ 6వ తేదీన విద్యుత్ కేంద్రం మూతపడింది.
మూడు తరాలతో విడదీయరాని బంధం..
తాతలు, తండ్రులు, చివరగా కుమారులు.. ఇలా మూడు తరాలు విద్యుత్ కేంద్రంతో విడదీయరాని బంధం కలిగి ఉన్నారు. ఇక్కడే ప్రస్తుతం యాదాద్రి విద్యుత్ కేంద్రానికి బదిలీ చేస్తూ ఒక్కసారిగా ఉ త్తర్వులు వెలువడడంతో ఉద్వేగానికి లోనవుతున్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్‌కు 85 మంది
ఉత్తర్వులు జారీచేసిన పవర్ జనరేషన్ కార్పొరేషన్
స్థానికంగా కొందరు
యాదాద్రిలో 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక యూనిట్ పూర్తయ్యింది. త్వరలో రెండో యూనిట్ కమీషన్డ్ చేసే అవకాశం ఉంది. ఇలా దశలవారీగా అన్నియూనిట్లను విద్యుత్ ఉత్పత్తి దశలోకి వేగవంతంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడి ఉద్యోగులను మూకుమ్మడిగా యాదాద్రికి బదిలీ చేసినట్లు తెలిసింది. రెండో లిస్టులో ఎంతమందిని బదిలీ చేస్తారనే విషయమై స్పష్టత లేదు. ప్రస్తుతం ఉన్న బీ–థర్మల్‌ను కూలదోసే క్రమంలో స్థానికంగా కొంతమంది ఇంజినీర్లను స్థానికంగానే కొనసాగించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం.
– దాసరి శంకరయ్య, ఇన్‌చార్జి ఎస్‌ఈ,
బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం, రామగుండం


