బీఆర్‌ఎస్ 25 ఏళ్ల సభ విజయవంతం చేయాలి
● కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ● మానేరు రివర్ ఫ్రంట్‌కు నిధులివ్వాలి ● కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్‌కల్చరల్: బీఆర్‌ఎస్ స్థాపించి 25 ఏళ్లను పురస్కరించుకొని ఈనెల 27న ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం నగరంలోని ప్రతిమ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. 25 ఏళ్ల పార్టీ వైభవాన్ని, కోట్లాది మంది ప్రజల ఆదరాభిమానాలను స్మరించుకుంటూ ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు. ఎల్కతుర్తిలో సభ కోసం రైతులు 1,200 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని అన్నారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధిపై కనీస శ్రద్ధ చూపడం లేదన్నారు. ఆర్టీసీ నుంచి పెద్దఎత్తున బస్సులు బుక్ చేసి డబ్బులు చెల్లించామని వివరించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు బస్సులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ రావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులున్నారు.


