ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి
గోదావరిఖని: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సింగరేణిపై అవలంబిస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో కేంద్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ యూనియన్లు ఎన్నికల సందర్భంగా హామీలు నెరవేర్చాలన్నారు. తప్పుడు హామీలతో కార్మికులను మోసం చేసిన యూనియన్లు కార్మికులకు సమాధానం చెప్పాలన్నారు. భూగర్భగనుల్లో కూడా ప్రైవేటీకరణ పెరిగిపోయిందని ఓసీపీల్లో బొగ్గు తీసేపని కూడా కాంట్రాక్టర్లకు అప్పగించారని వాపోయారు. గతంలో బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని బీఆర్‌ఎస్, టీబీజీకేఎస్ అడ్డుకున్నాయన్నారు. గతంలో వేలంపాట నిర్వహించిన సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులు పొందిన సంస్థలకు కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. సమావేశంలో 11డివిజన్లకు చెందిన 85 మంది కేంద్ర ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు తెలంగాణ అమరవీరులు, బొగ్గుగనుల్లో పనిచేస్తూ మృతిచెందిన కార్మికులకు నివాళులర్పించారు. సమావేశంలో యూనియన్ చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శి కె.సురేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రాంమ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపెల్లి రవి, కేంద్ర నాయకులు చెరుకు ప్రభాకర్‌రెడ్డి, బడికల సంపత్, ధరావత్ మంగీలాల్, సదానందం, జె రవీందర్, కూశన వీరభద్రం, ఎల్.వెంకటేశ్, ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్, తదితరులు పాల్గొన్నారు.


