పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

Mar 18 2025 12:27 AM | Updated on Mar 18 2025 12:24 AM

చిగురుమామిడి(హుస్నాబాద్‌): గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని జిల్లా విద్యాధికారి ఎన్‌.జనార్దన్‌రావు కోరారు. మండలంలోని చిన్నముల్కనూర్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రధానమంత్రి స్కూల్స్‌ పథకం కింద మంజూరైన తరగతి గదిని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పీఎంశ్రీ పథకం కింద 22 పాఠశాలలను ఎంపికచేసినట్లు పేర్కొన్నారు. జిల్లా సెక్టోరల్‌ అధికారులు శ్రీనివాస్‌, అశోక్‌రెడ్డి, స్కూల్‌కాంప్లెక్స్‌ హెచ్‌ఎం రబియాబస్రి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ హర్జిత్‌కౌర్‌, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం శారద పాల్గొన్నారు.

కుష్ఠువ్యాధి సర్వే

పకడ్బందీగా చేపట్టాలి

కొత్తపల్లి(కరీంనగర్‌): జిల్లావ్యాప్తంగా కుష్ఠు వ్యాధి సర్వే పకడ్బందీగా చేపట్టాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటరమణ సూచించారు. కొత్తపల్లి(హెచ్‌) పీహెచ్‌సీలో సోమవారం కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య కార్యకర్తలందరూ ప్రతీ ఇంటిలోని కుటుంబ సభ్యులను పరిశీలించాలని, స్పర్శ లేని రాగిరంగు మచ్చలు ఉంటే అనుమానితులుగా నమోదు చేయాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే లక్షణాలను బట్టి పూర్తి చికిత్స తీసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. జిల్లా అదనపు వైద్యాధికారి (లెప్రసీ అండ్‌ ఎయిడ్స్‌) డాక్టర్‌ సుధ మాట్లాడుతూ, కుష్ఠు వ్యాధి నిర్ధారణ అయితే 5 మచ్చలలోపు వారికి 6 నెలల చికిత్స, 5 మచ్చల కంటే ఎక్కువ ఉంటే 12 నెలలపాటు చికిత్స తీసుకుంటే నయం అవుతుందని వివరించారు. పీవోఎంసీహెచ్‌ డాక్టర్‌ సనజవేరియా, లెప్రసీ న్యూక్లియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నిక్కత్‌, డాక్టర్‌ నజియా, డిప్యూటీ పారామెడికల్‌ ఆఫీసర్‌ లింగారెడ్డి, ప్రకాష్‌, డీపీవో స్వామి పాల్గొన్నారు.

ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు

విద్యానగర్‌(కరీంనగర్‌): భద్రాచలంలో ఏప్రిల్‌ 6న జరిగే శ్రీసీతారాముల కల్యాణం సందర్భంగా అక్కడికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేసినట్లు కరీంనగర్‌ రీజనల్‌ మేనేజర్‌ బి.రాజు తెలిపారు. తలంబ్రాలు కావాల్సిన వారు ఒక్కో ప్యాకెట్‌కు రూ.151తో ఆన్‌లైన్‌ లేదా బస్టాండ్‌ కార్గో సెంటర్లు, ఏజెంట్‌ కౌంటర్ల వద్ద బుక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

621 మంది గైర్హాజరు

కరీంనగర్‌: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలో 621 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో జగన్మోహన్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జనరల్‌, ఓకేషనల్‌ విభాగంలో 19,425 మందికి గాను 621 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 18,804 మంది పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,140

జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో సోమవారం క్వింటాల్‌ పత్తి రూ. 7,140 పలికింది. క్రయ విక్రయాలను మార్కెట్‌ చైర్‌ పర్సన్‌ పూల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం పర్యవేక్షించారు.

పిల్లలను ప్రభుత్వ   పాఠశాలల్లో చేర్పించాలి1
1/2

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

పిల్లలను ప్రభుత్వ   పాఠశాలల్లో చేర్పించాలి2
2/2

పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement