వరిలో మెడవిరుపు తెగులు

తాలుగా మారిన వరి గింజలను చూపిస్తున్న రైతు
 - Sakshi

వీణవంక(హుజూరాబాద్‌): ఆరుగాలం శ్రమించి, పంట పండించిన రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. ఈసారైనా కాలం కలిసివస్తుందన్న ఆశతో యాసంగిలో వరి సాగు చేస్తే ఆదిలోనే కాండం తొలుచు పురుగు ఉధృతికి పైరు పూర్తిగా దెబ్బతింది. కొంతమంది అన్నదాతలు గత్యంతరం లేక చేనును చెడగొట్టి, మళ్లీ నాట్లు వేశారు. ఇటీవల కురిసిన వడగండ్ల వాన వారిని కోలుకోలేని దెబ్బతీసింది. నాలుగు రోజులుగా వాతావరణం చల్లబడుతుండటంతో మెడవిరుపు తెగుళు ఆశించి, పైరును నాశనం చేస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే చేను మొత్తం వ్యాప్తి చెందుతుందని రైతులు వాపోతున్నారు.

20 వేల ఎకరాల్లో ప్రభావం..

కరీంనగర్‌ జిల్లాలో ఈసారి 1.91 లక్షల ఎకరాలలో వరి సాగు చేసినట్లు అధికారుల లెక్కలు చెప్పుతున్నాయి. మెడవిరుపు తెగులు ప్రభావం జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాల్లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పైరు గింజ పట్టు దశలో ఉండగా కొన్నిచోట్ల పొట్ట దశలో ఉంది. ఈ తెగులు ఆశిస్తే వరి కంకి గొలుసు కింద నల్లటి మ చ్చలు ఏర్పడతాయి. తర్వాత కంకి ఎండిపోయి, రెండు, మూడు రోజుల్లోనే గింజలు తాలుగా మారుతాయి. వాతావరణ మార్పులే ఈ తెగులుకు కారణమని అధికారులు అంటున్నారు. దీని లక్షణాలు కనిపిస్తే పొలం నిండా నీరు పెట్టాలని, ఎట్టి పరిస్థితుల్లో ఆరబెట్టొద్దని చెబుతున్నారు.

సగం దిగుబడి రావడమే గగనం..

జిల్లా వ్యాప్తంగా అగ్గి తెగులు, మెడవిరుపు తెగులు ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.25 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. వరి నాటు వేసిన వారం నుంచే కాండం తొలుచు పురుగు వ్యాప్తి చెందింది. రూ.10 వేలు ఖర్చుపెట్టి, ఆరు సార్లు రసాయన మందులు పిచికారీ చేసినా ఫలితం దక్కలేదు. ఇంకో 20 రోజులైతే పంట చేతికి వస్తుందనగా మెడవిరుపు తెగులు రైతన్నను ఆందోళనకు గురిచేస్తోంది. ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తుందని ఆశిస్తే అందులో సగం రావడమే గగనంగా మారిందని అన్నదాతలు అంటున్నారు.

నివారణ చర్యలు..

పూత దశ నుంచి గింజ పాలు పోసుకునే దశలో లక్షణాలు కనిపిస్తే ఎకరాకు ట్రైసైక్లోజోల్‌, మ్యాంకోజెబ్‌ 500 గ్రాములు, లేదా ఐసోప్రోథయోలెన్‌ 320 మి.లీ. లేదా కాసుగమైసిన్‌ 500 మి.లీ. పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్‌ 25 శాతం, టెబుకొనోజాల్‌ 50 శాతం 80 గ్రాములు లేదా, పికాక్సీస్ట్రోలిన్‌ 6.78 శాతం, ట్రైసైక్లోజోల్‌ 20.33 శాతం, ఎస్‌పీ 400 మి.లీ. పిచికారీ చేయాలి. కాండం కుళ్లు తెగులుకు మొక్క మొదళ్లు తడిచేలా హెక్సాకొనజోల్‌ 400 మి.లీ. లేదా ప్రాపికొనజోల్‌ 200 మి.లీ. ఎకరాకు పిచికారీ చేయాలి.

పైరును నాశనం చేస్తున్న వైనం

రెండు, మూడు రోజుల్లోనే తాలుగా మారుతున్న గింజలు

వాతావరణ మార్పులే కారణమంటున్న అధికారులు

దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతన్న ఆందోళన

జిల్లాలో 1.91 లక్షల ఎకరాలలో వరి సాగు

రైతులను అప్రమత్తం చేశాం

20 రోజుల క్రితమే మెడవిరుపు తెగులుపై రైతులను అప్రమత్తం చేశాం. ఇప్పటికై నా తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కాండం తొలుచు పురుగు, కాండం కుళ్లు తెగులు ఉధృతి కూడా అక్కడక్కడ కనిపిస్తోంది. రైతులు దిగులు పడకుండా అప్రమత్తంగా ఉండాలి.

– వెంకటేశ్వర్‌రావు, కేవీకే శాస్త్రవేత్త

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top