నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో ప్రస్తుతమున్న భూగర్భ జలాలను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎల్లారెడ్డి డీఎల్‌పీవో సురేందర్ సూచించారు. లింగంపల్లికలాన్‌లో బుధవారం భూగర్భ జలాల సంరక్షణ విషయమై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. అధికారి మహేష్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీవో ప్రభాకర్ చారి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజ్ కుమార్, ఈసీ సాయిలు, కార్యదర్శి వనజ తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: ప్రజల దైనందిన జీవితంలో జియో ఇన్ఫర్మాటిక్స్ భాగంగా మారిందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ రామ్మూర్తి అన్నారు. బుధవారం తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో జరుగుతున్న జియో ఇన్ఫర్మేటిక్స్ సెమినార్ రెండవ రోజులో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు గ్రామీణ ప్రాంతంలోని జాగ్రఫికల్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాలను ఏ విధంగా మ్యాపింగ్ చేయాలో విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీ పావని, ప్రొఫెసర్ శివ ప్రతాప్, ఎన్‌ఆర్‌ఎస్‌సీ మాజీ డైరెక్టర్ రాఘవస్వామి, సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ సుధాకర్‌గౌడ్, సెమినార్ కన్వీనర్ ప్రతిజ్ఞ, ఆర్గనైజింగ్ కార్యదర్శి నారాయణ గుప్తా, హెచ్‌వోడీ కవిత, తదితరులు పాల్గొన్నారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): పెద్దకొడప్‌గల్ గ్రామ శివారులో ఉన్న రెండు ట్రాన్స్‌ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేసి కాపర్‌ను దొంగిలించినట్లు ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపారు. ఎస్సై బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులో ఉన్న రబ్‌డ్యా బంతిలాల్ అనే రైతు పక్కన ఉన్న రెండు ట్రాన్స్‌ఫార్మర్లను మంగళవారం రాత్రి దుండగులు ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్‌ను దొంగిలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. జీపీ కార్యదర్శి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
స్థలం కోసం ఇరు గ్రామాల మధ్య ఘర్షణ
ఎల్లారెడ్డిరూరల్: నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లి గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలం కోసం ఇరు గ్రామాల మధ్య బుధవారం ఘర్షణ చోటుచేసుకుంది. అక్కంపల్లి జీపీ భవన నిర్మాణం కోసం గ్రామశివారులోని సర్వే నం.95/1లో పనులు చేపట్టేందుకు అక్కంపల్లి గ్రామస్తులు ప్రయత్నించారు. విషయం తెలసుకున్న అదే పంచాయతీ పరిధిలోని కిచ్చన్నపేట గ్రామస్తులు అక్కడికి చేరుకొని తాము కబ్జాలో ఉన్న స్థలంలో జీపీ భవనాన్ని ఎలా నిర్మిస్తారంటూ అడ్డుకున్నారు. దీంతో ఇరుగ్రామాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి ఎస్సైలు భార్గవ్‌గౌడ్, దీపక్ కుమార్, సుబ్రమణ్యచారి తమ సిబ్బందితో అక్కంపల్లి గ్రామానికి చేరుకొని ఇరు గ్రామాల ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఇరు గ్రామాల ప్రజలు వినిపించుకోకపోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.
మాచారెడ్డి: మండలంలోని పోలంపల్లి శాంతానంద తపోవన ఆశ్రమంలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం విశ్వశాంతి మహా యజ్ఞాన్ని నిర్వహించారు. లోక కళ్యాణార్థం విశేషాలు నిర్వహించినట్లు నిర్వాహకుడు స్వామి తెలిపారు. ఆలయ ధర్మకర్త రాజమౌళి గుప్తా దంపతులు, గ్రామస్తులు ఉన్నారు.


