కామారెడ్డి క్రైం : ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్ జిల్లా ముఠాను భిక్కనూరు పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. భిక్కనూరులోని పెద్దమ్మ ఆలయంలో ఈ నెల 23న చోరీ జరిగింది. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం భిక్కనూరు టోల్‌గేట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను కంచర్ల గ్రామానికి చెందిన మాట్టె అచ్యుత్, కొక్కు గణేష్‌గా గుర్తించారు. వారిద్దరూ కలిసి పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇసన్నపల్లి, కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ఆలయాల్లోనూ దొంగతనాలు చేశారని గుర్తించారు. మరో 10 చోరీల్లో వారు నిందితులుగా ఉన్నారు. గణేష్ గతంలో జైలుకు వెళ్లివచ్చాడు. నిందితుల నుంచి భిక్కనూరు ఆలయంలో చోరీ చేసిన పెద్దిరాజు ఇత్తడి విగ్రహం, పలు రోల్డ్‌గోల్డ్ ఆభరణాలు, ఆలయాల్లోని సీసీ కెమెరాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.


