‘ఉద్యోగాలు ఇప్పించడం ప్రభుత్వ బాధ్యత’ | - | Sakshi
Sakshi News home page

‘ఉద్యోగాలు ఇప్పించడం ప్రభుత్వ బాధ్యత’

Mar 25 2026 7:03 AM | Updated on Mar 25 2026 7:03 AM

‘ఉద్యోగాలు ఇప్పించడం ప్రభుత్వ బాధ్యత’ గ్రూప్‌ వన్‌ అధికారులకు కలెక్టర్‌ పాఠాలు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో తనిఖీలు ‘క్షయ రహిత జిల్లాగా మార్చాలి’ మంత్రి అభినందన

నాగిరెడ్డిపేట: యువతకు ఉద్యోగాలిప్పించడం రాజకీయ వాగ్దానం కాదని, ప్రభుత్వ బాధ్యతని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. ప్రాంతీయ అభివృద్ధి కోసం సరైన ప్రణాళికలు, సమర్థవంతమైన చర్యలు అవసరమన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వెనకబడిన నియోజకవర్గంగా పేరొందిన ఎల్లారెడ్డి ప్రాంతంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

కామారెడ్డి అర్బన్‌: ప్రకృతి విపత్తుల్లో ఉన్నతాధికారులు వేగవంతమైన స్పందన, సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ గ్రూప్‌ వన్‌ అధికారుల సంయుక్త ఫౌండేషన్‌ కోర్సు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ సంగ్వాన్‌ మంగళవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఒత్తిడిలో స్థైర్యం– 2025లో కామారెడ్డి వరదలను ఎదుర్కోవడం, వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉన్న జిల్లాలను నిర్మించడం’ అనే అంశంపై ప్రసంగించారు. కొత్తగా నియమితులయ్యే గ్రూప్‌ వన్‌ అధికారులు ప్రజాసేవలో నిబద్ధతతో ఉండాలని, సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ సమీపంలోగల పలు హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో మంగళవారం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో కనీస పరిశుభ్రత పాటించకపోవడంపై ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు శిరీష, విక్రమ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కృత్రిమ రంగుల వినియోగాన్ని గుర్తించి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డిని క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్‌వో రవీందర్‌గౌడ్‌ సూచించారు. మంగళవారం వరల్డ్‌ టీబీ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లో టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ వంద రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెంట్రల్‌ టీబీ డివిజన్‌ ఎంపిక చేసిన 118 గ్రామాల్లో జిల్లావ్యాప్తంగా హ్యాండ్‌హెల్డ్‌ ఎక్స్‌రే యంత్రాల ద్వారా ఇంటి వద్దకే వెళ్లి టీబీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరు నెలల పాటు మందులు ఇస్తామని, పోషకాహారం కోసం ప్రతినెలా వెయ్యి రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. సకాలంలో మందులు వాడితే క్షయ వ్యాధి పూర్తిగా నయమవుతుందని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ చంద్రప్రియ, ప్రోగ్రాం ఆఫీసర్లు ప్రదీప్‌ కుమార్‌, పద్మజ, టీబీ సూపర్‌వైజర్‌ చంద్రకాంత్‌ పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: జిల్లాలో సీఎం కప్‌ క్రీడలను విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా యువజన క్రీడల అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్‌ను రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి.శ్రీహరి అభినందించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో సీఎం కప్‌ 2025–26 రెండో ఎడిషన్‌ విజయవంతంపై అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మంత్రి తనను అభినందించారని వెంకటేశ్వరగౌడ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement