కామారెడ్డి క్రైం: కామారెడ్డి కొత్త బస్టాండ్‌లో ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్‌ను చోరీ చేసి పరారైన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ ప్రశాంత్‌రెడ్డి, హోంగార్డు నర్సింలు సోమవారం రాత్రి వివేకానంద కాలనీలో బీట్ విధుల్లో ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్లడాన్ని గమనించి అడ్డుకున్నారు. వారి వద్ద ఓ మహిళకు చెందిన బ్యాగ్ ఉండడంతో అనుమానం వచ్చి విచారించగా.. బస్టాండ్‌లో మహిళ హ్యాండ్ బ్యాగ్‌ను దొంగలించి పరారైన విషయం బయటపడింది. నిందితులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. విధుల్లో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్, హోంగార్డులను మంగళవారం ఎస్పీ అభినందించారు.


