● పోలీసులు, ఆశాకార్యకర్తల మధ్య తోపులాట
కామారెడ్డి టౌన్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కలెక్టరెట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నింగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆశాకార్యకర్తలు బారికేడ్లను పక్కకు జరిపి ప్రధాన గేటు వైపు దూసుకువెళ్లారు. పోలీసులు వారిని నిలువరించే క్రమంలో ఇరువర్గాల మధ్య సుమారు అరగంట పాటు తోపులాట జరిగింది. ఓ ఆశాకార్యకర్తల సొమ్మసిల్లి పడిపోగా.. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, అరుణ్‌కుమార్ మాట్లాడుతూ మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన సీఐ నరేశ్‌ను సస్పెండ్ చేయాలని, ఆయనపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల డిమాండ్లను నెరవేర్చకుంటే త్వరలోనే చలో హైదరాబాద్ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశావర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందిర, రాజశ్రీ, నాయకులు మమత, లావణ్య, గీత, సీఐటీయూ నాయకులు నర్సింలు, సత్యం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


