ఎల్లారెడ్డి: మార్కెట్‌లో కోడి మాంసం ధర కొండెక్కి కూచుంది. అదే సమయంలో కోడి గుడ్డు ధర మాత్రం సగానికి పడిపోయింది. రెండు నెలల క్రితం కిలో చికెన్ ధర రూ. 240 నుంచి రూ. 260 పలుకగా.. ప్రస్తుతం రూ. 320 నుంచి రూ. 360 వరకు విక్రయిస్తున్నారు. గుడ్డు ధర మాత్రం రూ. 7 నుంచి రూ. 4కు పడిపోయింది.
జిల్లాలో ఈనెల మొదటి వారంలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 290, డ్రెస్స్‌డ్ చికెన్ ధర రూ. 260 ఉండేది. రెండో వారాంతానికి ధర అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 360, డ్రెస్స్‌డ్ చికెన్ ధర రూ. 340 కి చేరింది. నాటు కోళ్లను ఒక్కోదానిని రూ. 750 నుంచి రూ. 800లకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రతతో కోళ్లు చనిపోతున్నాయని, మరోవైపు వివాహాలు, రంజాన్ మాసం కారణంగా డిమాండ్ పెరగడంతో చికెన్ ధర ఆకాశాన్నంటుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన దాణా ధరలు కూడా చికెన్ రేటు పెరగడానికి కారణంగా భావిస్తున్నారు.
సగం ధరకే కోడి గుడ్డు..
నిన్నామొన్నటి వరకు ఆకాశాన్నంటిన కోడి గుడ్డు ధర.. ప్రస్తుతం భారీగా పడిపోయింది. నెల క్రితం వరకు గుడ్డు ధర రూ. 7 వరకు పలికింది. ప్రస్తుతం రూ. 3.50 నుంచి రూ. 4 వరకు దొరుకుతోంది. గతంలో రాష్ట్రంలో ఉత్పత్తయ్యే గుడ్లలో 50 శాతానికిపైగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యేవని, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండవని, అందుకే ధర తగ్గించి అమ్ముకుంటున్నామని పేర్కొంటున్నారు.


