భార్యను హతమార్చిన భర్త
● పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు
● ఇటీవల ఆత్మహత్యకు
యత్నించిన నిందితుడు
రెంజల్(బోధన్): భార్యను హత్య చేసిన భర్త నేరుగా వచ్చి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. గ్రామస్తులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా.. మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన మల్లుగారి బస్వారెడ్డికి భార్య రుక్మిణి(54), ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు భార్గవ్‌రెడ్డికి వివాహం కాగా, గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. చిన్నకుమారుడు హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. బస్వారెడ్డికి మానసిక పరిస్థితి బాగోలేదు. గతంలో ఇంటి నుంచి వెళ్లి, కొన్ని రోజులకు తిరిగివచ్చాడు. ఇటీవల అతడు ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొంది నాలుగురోజుల కిందటే ఇంటికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం అతడు తన భార్య రుక్మిణిని వ్యవసాయ పావుడతో తలపై తీవ్రంగా చితకబాదడంతో ఆమెకు అధిక రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే బస్వారెడ్డి రెంజల్‌లోని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునేంతవరకు ఇంట్లోని వారికి కూడా హత్య విషయం తెలియలేదు. ఇంటి ముందు ఆటలాడుకుంటున్న పిల్లలు గుర్తించి చుట్టుపక్కల వారికి వివరించారు. బోధన్ రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎస్సై చంద్రమోహన్‌లు గ్రామానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కుమారుడు భార్గవ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని బోధన్‌లోని జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


