ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్!
పట్టా పాస్‌బుక్ నంబర్ నమోదు చేస్తేనే...
పక్కదారి పట్టకుండా..
యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కృత్రిమ కొరతను నివారించేందుకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు వీలుగా ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’ను రూపొందించింది. ఈ యాప్ ద్వారానే యాసంగి సీజన్‌లో యూరియా అందించనుంది. – నాగిరెడ్డిపేట
● నేటినుంచి అందుబాటులోకి
‘ఫెర్టిలైజర్’ యాప్
● యూరియా కృత్రిమ కొరతను
నివారించేందుకు చర్యలు
జిల్లాలో గత సీజన్‌లో యూరియా కొరత ఏర్పడింది. సరిపడా సరఫరా కాకపోవడంతో బస్తా ఎరువుకోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. వ్యాపారులు యూరియా బస్తాలను బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించడం, రైతులు విచ్చలవిడిగా వాడుతుండడం వంటి కారణాలతో దాదాపు ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను ప్రవేశపెడుతుంది. ఈ యాప్ ద్వారా రైతులు యూరియాను తమ మొబైల్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు. నాన్ పైలట్ జిల్లాగా ఎంపికై న కామారెడ్డిలో సోమవారం నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్ బుకింగ్ సౌలభ్యం వల్ల యూరియా పంపిణీలో పారదర్శకత పెరగడంతోపాటు కొరత ఏర్పడకుండా ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. అలాగే డీలర్ వద్ద ఎంత యూరియా నిల్వ ఉందనే విషయం కూడా స్పష్టంగా తెలియనుంది. దీంతోపాటు రైతులకు గంటల తరబడి పడికాపులు కాసే అవస్థ తప్పుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
39 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం
ఈ యాసంగి సీజన్‌లో జిల్లావ్యాప్తంగా రైతులు 4.04 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. సుమారు 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. గతంలో రైతులు తాను వేసిన పంటసాగుకు అవసరమైన యూరియా మొత్తాన్ని ఒకేసారి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం యాప్ ద్వారా రైతు విడతలవారీగా మాత్రమే యూరియాను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎకరా భూమి ఉన్న రైతుకు 3 బస్తాల యూరియాను ఒకే విడతలో, ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతుకు రెండు విడతల్లో, 5 నుంచి 20 ఎకరాలలోపు భూమి ఉన్న రైతు మూడు విడతల్లో, 20 ఎకరాలపైన భూమి ఉన్న రైతు నాలుగు విడతల్లో యూరియాను బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో సంబంధిత రైతు తనకున్న సాగుభూమికి సంబంధించిన పట్టా పాస్‌బుక్ నంబర్‌ను నమోదు చేస్తేనే యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. యాప్‌లో ప ట్టా పాస్‌బుక్ నంబర్‌ను నమోదు చేయగానే పాస్‌బుక్‌కు లింకై ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వ స్తుంది. ఓటీపీని యాప్‌లో ఎంట్రీ చేయగానే మండలంలో ఏ డీలర్ వద్ద ఎంత యూరియా నిల్వ ఉందనే వివరాలతోపాటు సదరు రైతుకు ఉన్న భూమి విస్తీర్ణం, సాగుచేస్తున్న పంట వివరాలు కనిపిస్తాయి. దీంతో రైతు తనకు అనువుగా ఉన్న డీలర్ వద్ద యూరియాను బుక్ చేసుకోవచ్చు. కాగా ముందుగా బుక్ చేసిన యూరియాను రైతు తీసుకోకపోతే 24 గంటల్లో బుకింగ్ రద్దయి రైతు బుక్ చేసిన యూరియా బస్తాలు తిరిగి ఓపెనింగ్ బ్యాలెన్స్‌లోకి వెళ్లిపోతాయి.
గత సీజన్‌లో యూరియా కోసం రైతులు అక్కడక్కడ ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మొబైల్ యాప్‌ను తీసుకువచ్చింది. సోమవారంనుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. కొత్త విధానంలో యూరియా పక్కదారి పట్టే అవకాశాలు ఉండవు. – సాయికిరణ్, ఏవో, నాగిరెడ్డిపేట
ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్!


