లోక్ అదాలత్‌కు భారీ స్పందన
● 3,215 కేసులను పరిష్కరించాం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన లభించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్‌వీఆర్‌ఆర్ వరప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లాలో ఆరు బెంచీలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని కోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆయా కేసులకు ఇరువర్గాలతో మాట్లాడి పరిష్కారం చూపామన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించిన కేసులు తుది తీర్పుగా పరిగణిస్తామని, పై అప్పిల్ ఉండదని పేర్కొన్నారు. ఇరు పక్షాలకు సంతృప్తికరమైన పరిష్కారం లభించడం వల్ల సంబంధాలు చెడిపోకుండా సమాజ శాంతి కాపాడబడుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా 3,215 కేసులను పరిష్కరించామని పేర్కొన్నారు. ఇందులో 3,122 క్రిమినల్ కేసులు, 11 సివిల్, 14 ఎంఏసీటీ, 68 ప్రి లిటిగేషన్ కేసులు ఉన్నాయన్నారు. బాధితులకు పరిహారం కింద రూ. 94.25 లక్షలు అందించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.నాగరాణి, సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీలు సుమలత, దీక్ష, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్, కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


