వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని కల్వరాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ చూపినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్థన్ రెడ్డి ఆదివారం తెలిపారు. అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన జిజ్ఞాసలో కల్వరాల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. పాఠశాలకు చెందిన కె.ప్రసన్న, జె. స్నేహలు ప్రతిభ చూపినట్లు తెలిపారు. వీరికి గైడ్‌గా వ్యవహరించిన ఉపాధ్యాయురాలు శైలజను అభినందించారు. వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే ఫార్మర్ ఫ్రెండ్లీ ఫర్టిలైజర్ పరికరాన్ని రూపొందించి ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రదర్శన రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచి బెంగుళూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థులకు రూ.4 వేల నగదు పురస్కారం, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేసినట్లు పేర్కొన్నారు.
అబాకస్ జిల్లా స్థాయి పోటీలు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఈఎస్‌ఆర్ గార్డెన్‌లో విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అబాకస్, వేదిక్ మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీలను ఆదివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 30 పాఠశాలల నుంచి 550 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ చాటిన 36 మందిని విజేతలుగా ఎంపిక చేశామని జనవరిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో వీరు పాల్గొంటారని విశ్వం ఎడ్యుటెక్ ప్రతినిధి వినాయక్ తెలిపారు. విజేతలకు సర్టిఫికెట్‌లను పంపిణీ చేశారు. సాందీపని విద్యాసంస్థల డైరెక్టర్ బాలాజీరావు, ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్లూబెల్స్ విద్యార్థుల ప్రతిభ
పిట్లం(జుక్కల్) జిల్లా కేంద్రంలో ఆదివారం విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి అబాకస్, వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో పిట్లం బ్లూబెల్స్ పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్ సంజీవరెడ్డి.. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.
బిచ్కుంద నుంచి..
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని సద్గురు బండాయప్ప స్వామి స్కూల్ విద్యార్థులు విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అబాకస్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని స్కూల్ మేనేజ్‌మెంట్ ఇన్‌చార్జి సంతోష్ అప్ప తెలిపారు. జూనియర్, సీనియర్ చాంపియన్‌కు అభిశ్రీ , అంజలి ఎంపికయ్యారని అన్నారు.
వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ


