కాసుల కోసం కోత లు!
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కాన్పుల వివరాలు
సాధారణ కాన్పులు చేయాలి
కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీజరియన్ ద్వారా జరుగుతున్న ప్రసవాల సంఖ్య ఆందోళకలిగిస్తోంది. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సాధారణ, సీజేరియన్ ప్రసవాల సంఖ్యల మధ్య వత్యాసం ధనార్జన ధ్యేయాన్ని కళ్లకు కడుతోంది. సాధారణ ప్రసవాలు చేసే అవకాశం ఉన్నా ఆవైపు ప్రయత్నాలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా కాసుల కోసం కోతలు పెడుతున్నారు. ప్రసవాల గణాంకాలు వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నాయనే విమర్శలున్నాయి. తనిఖీలు చేపట్టకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తం కాన్పుల్లో 85 శాతం ఆపరేషన్లు కావడం గమనార్హం. కేవలం 15 శాతం మాత్రమే సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిబంధనల ప్రకారం సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. కానీ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ప్రభుత్వ ఆస్పత్రులో మొత్తం 4775 ప్రసవాలు కాగా ఇందులో సాధారణ ప్రసవాలు 49 శాతం, సీజేరియన్‌లు 51శాతం ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో మొత్తం ప్రసవాల సంఖ్య 2737 కాగా ఇందులో సాధారణ ప్రసవాలు కేవలం 15 శాతం ఉండగా, సిజేరియన్‌లు 85 శాతం ఉన్నాయి.
చర్యలు తీసుకోరు.. అవగాహన కల్పించరు..
జిల్లాలో ఇంత జరుగుతున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రుల్లో ఆడిటింగ్ నిర్వహించడంతోపాటు అనవసరంగా సిజేరియన్లు చేసే వైద్యులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రసవాలపై గర్భిణులకు సంబంధితశాఖ సరైన అవగాహన కల్పించడం లేదని అంటున్నారు. సాధారణ కాన్పుకు అవకాశం ఉన్నా కొందరు గర్భిణులు వారి కుటుంబ సభ్యులు ముహూర్తాలు చూసుకుంటూ సీజేరియన్‌ల వైపు వెళ్తున్నారు.
15శాతం మాత్రమే సాధారణ కాన్పులు
85 శాతం సీజేరియన్‌లు
విస్తుగొలుపుతున్న కాన్పుల గణాంకాలు
ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాకం
ప్రభుత్వ సూచనలు బేఖాతరు
పట్టింపు లేనట్టుగా వైద్యారోగ్యశాఖ
ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భిణులకు సాధరణ కాన్పు చేసేందుకు ప్రయత్నించాలి. మొదటి కాన్పు మాత్రం తప్పకుండా సాధారణమే చేయాలి. తప్పని పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలి. అవసరం లేకున్నా సిజేరియన్ చేస్తే చర్యలు తీసుకుంటాం. గర్భిణులు సైతం సాధారణ కాన్పువైపే మొగ్గు చూపాలి. సీజేరియన్ చేసుకుంటే భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
– డాక్టర్ విద్య, డీఎంహెచ్‌వో
కాసుల కోసం కోత లు!


