తాడ్వాయిలో ఒకరి ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బాజన్నోల స్వామి(52) అనే వ్యక్తి చాకలి వృత్తితోపాటు వ్యవసాయ పనులు చేసుకుంటూ తన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. కాగా తన కుమారుడైన నవీన్ 45 రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం నవీన్ తన తల్లి రాజమణి, తండ్రి స్వామి, మొదటి భార్య నవనీతతో తరచుగా గొడవలు పడుతుండేవాడు. కాగా ఈనెల 18న నవీన్ తన ఇంటికి వచ్చి తన రెండో భార్య రమ్యతో కలసి ఉండాలని తల్లికి చెప్పగా, ఆమె నిరాకరించింది. దీంతో నవీన్ తన తండ్రి స్వామిపై దాడి చేశాడు. దీంతో స్వామి జీవితంపై విరక్తి చెంది ఈనెల 19న రాత్రి తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న స్వామిని కుటుంబసభ్యులు గుర్తించి చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి అతడు మృతి చెందాడు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ వివరించారు.


