కామారెడ్డిలో విపత్తుల మాక్ డ్రిల్
● రేపు, ఎల్లుండి సైతం..
● పాల్గొన్న వివిధ శాఖల అధికారులు
కామారెడ్డి అర్బన్: పట్టణంలోని జీఆర్ కాలనీలో, పెద్ద చెరువు వాగు పరిసరాల్లో శనివారం ఉదయం అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, ఆయా విభాగాల సేఫ్టీ అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక, అత్యవసర సేవలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, రెవెన్యూ, మున్సిపల్ శాఖాధికారులు, సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. మాక్ డ్రిల్‌తో విపత్తుల సమయంలో ఎదురయ్యే లోపాలను గుర్తించి విపత్తుల నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చని అధికారులు వివరించారు. మాక్ డ్రిల్ అనంతరం సమీక్ష నిర్వహించారు. కాగా ఆది, సోమవారాల్లోనూ విపత్తుల మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్టు అగ్నిమాపక, అత్యవసర సేవలశాఖ జిల్లా అధికారి ఆర్.సుధాకర్ తెలిపారు.


