ఆర్చరీలోనూ ఐపీఎల్ నిర్వహిస్తాం
● జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్‌ముండా
దోమకొండ: క్రికెట్‌లా ఆర్చరీలోనూ ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ మాజీ జాతీయ అధ్యక్షుడు, జార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా తెలిపారు. శుక్రవారం ఆయన దోమకొండ గడికోటను సందర్శించారు. కోటలోని అద్దాలమేడ, మహరాణి మందిరం, వెంకటపతి భవన్, మహదేవుని ఆలయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడికోట వారసుడు, జాతీయ అర్చరీ డైరెక్టర్ కామినేని అనిల్‌కుమార్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానన్నారు. కోచ్ ప్రతాప్‌దాస్ కృషి వల్ల మారుమూల ప్రాంతంనుంచి 14 ఏళ్లలో 50 మంది ఆర్చరీ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారన్నారు. కోచ్‌ను అభినందించారు. సర్పంచ్ నర్సయ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్ తదితరులు అర్జున్ ముండాను సన్మానించారు. భిక్కనూరు సీఐ సంపత్‌కుమార్, దోమకొండ ఎస్సై ప్రభాకర్‌ల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో జాతీయ ఆర్చరీ కమిటీ ఉపాధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి, కోశాధికారి జోరిస్‌పాల్, ప్రతినిధులు సుమంత్ మహతి, అరవింద్, ఆర్చరీ ఒలింపిక్ చాంపియన్ డోలా బెనర్జీ, జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు తిర్మల్ గౌడ్ తదితరులున్నారు.


