పాతికేళ్ల అజ్ఞాత జీవితానికి వీడ్కోలు!
పోలీసులకు లొంగిపోయిన ఎర్రగొల్ల రవి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రెండున్నర దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ ఎట్టకేలకు జనజీవన స్రవంతిలో కలిశాడు. పాతికేళ్ల ఉద్యమ ప్రస్థానానికి వీడ్కోలు పలికి శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట తన సహచరులతో కలిసి లొంగిపోయాడు.
పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవికి 2001 లో కామారెడ్డి పట్టణంలోని జీవీఎస్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అప్పటి పీపుల్స్‌వార్ నక్సల్స్‌తో పరిచయం ఏర్పడింది. కాలేజీకి వెళ్లిన రవి అటు నుంచి అటే అడవిబాట పట్టాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి చూడలేదు. దండకారణ్యంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన రవి.. ప్రస్తుతం డివిజనల్ కమిటీ సభ్యుడి హోదాలో పనిచేస్తున్నాడు. కాగా రవి పోలీసుల అదుపులో ఉన్నాడంటూ మూడు రోజుల క్రితం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో రవి లొంగిపోయి ఇంటికి వస్తే బాగుండు అని అతడి కుటుంబ సభ్యులు ఆశించారు. అతడి రాక కోసం తండ్రి రామయ్య వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాడు. శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు డీజీపీ ప్రకటించడంతో రవి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.


