ఉన్నత లక్ష్యాలతో పౌరులుగా ఎదగాలి
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ
కార్యదర్శి నాగరాణి
దోమకొండ: విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని, కష్టపడి చదివి, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని, ప్రతి బాలిక సురక్షిత వాతావరణంలో విద్యను అభ్యసించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి అన్నారు. శుక్రవారం అంబారిపేట గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల హక్కులు, పోక్సో చట్టం, బాల్యవివాహ నిషేధ చట్టం, బాల కార్మిక నిషేధ చట్టాలు తదితర వాటి గురించి అవగాహన కల్పించారు. లీగల్ ఎయిడ్ హెల్ప్‌లైన్‌కు ఏ సమస్య ఉన్నా 15100కు కాల్ చేయవచ్చని అన్నారు. ఎంఈవో విజయ్‌కుమార్, గ్రామ సర్పంచ్ కవిత అనిల్, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు, తదితరులు పాల్గొన్నారు.


