
‘కంది’ పంటకు కష్టం.. నష్టం
నష్టం జరగకుండా చూస్తాం
బిచ్కుంద(జుక్కల్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బిచ్కుంద మండలంలో సోయా, పత్తి, కంది, పెసర, మినుము, వరి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. పంట చేలలో వరద నీరు ఆగి ఉండడంతో సోయా, కంది పంట మొక్కలు కుళ్లిపోయి పూర్తిగా మాడిపోయాయి. దెబ్బతిన్న పంటలను గుర్తించి నివేదిక అందించాలని ప్రభుత్వ ఆదేశంతో బిచ్కుంద మండలంలో వ్యవసాయ అధికారులు సర్వే చేపట్టారు. మండలంలో ఎక్కువ శాతం కందిలో అంతర పంటగా సోయా సాగవుతుంది. ఎకరం భూమిలో అంతర పంటలో సోయా, కంది రెండు పంటలు నష్టపోయినప్పటికి ఆ రెండు పంటను సర్వే నివేదికలో నమోదు చేయాల్సి ఉండగా అధికారులు కేవలం సోయా పంటకు మాత్రమే నష్ట జరిగిందని సర్వే నివేదికలో నమోదు చేయడం గమనర్హం. కంది కుళ్లిపోయి ఎండిపోయింది. కనీసం ఒక ఎకరం కూడా నష్టపోయిందని అధికారులు గుర్తించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టం కింద ఒకే పంట పరిగణనలోకి తీసుకుంటే చాలా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరం కూడా గుర్తించకపోవడంపై ఆగ్రహం..
బిచ్కుంద మండలంలోని సిర్‌సముందర్, దేవాడ, దడ్గి, తక్కడ్‌పల్లి, బిచ్కుంద, దౌల్తాపూర్, గుండెకల్లూర్, మిషన్ కల్లాలి గ్రామాలలో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. అధికారులు సర్వే చేసి సోయా 2,685 ఎకరాలు, వరి 392 ఎకరాలు, పత్తి 86 ఎకరాలు, మినుము 18, పెసర 12 ఎకరాలు మొత్తం 3,193 ఎకరాలలో పంటలకు నష్టం జరిగిందని లెక్కలు తేల్చారు. వందల ఎకరాలలో కంది పంటకు నష్టం జరిగినప్పటికి ఒక్క ఎకరం కూడా గుర్తించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి నష్టంవాటిల్లిన రెండు పంటల వివరాలు తీసుకొని పరిహారం అందేవిధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.
దిగుబడిపై వర్ష ప్రభావం...
భారీ వర్షాలతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణంగా సోయా పంట ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు .. కంది 7 నుంచి 8 క్వింటాలు, పెసర 5 క్వింటాలు దిగుబడి వచ్చేది. పెసర, సోయా పూత దశలో ఉండగా వర్షాలు పడటంతో ఉన్నపూత రాలిపోయి కొన్ని కుళ్లిపోయాయి. దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం సోయా దిగుబడి ఎకరానికి 6 నుంచి 7 క్వింటాలు, కంది ఎకరానికి 4 క్వింటాలు దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. పెసర పంటకు పూర్తిగా నష్టం జరిగిందంటున్నారు.
ఒక ఎకరం భూమిలో అంతర పంటగా సాగవుతున్న రెండు పంటలు దెబ్బతింటే ఎకరం భూమి కింద ఒకే పంటను పరిగణలోకి తీసుకుంటున్నాం. సోయా అంతర పంటలో కంది సాగు అవుతుంది. ఏ పంటకు ఎక్కువ నష్టం ఉందో ఆ పంటను పరిగణలోకి తీసుకొని సర్వే నివేదికలో నమోదు చేస్తున్నాం. రైతులకు నష్టం జరగకుండా చూస్తాం.
–అమర్ ప్రసాద్, ఏవో, బిచ్కుంద
అంతర పంటలో భాగంగా కంది సాగును నష్టంగా గుర్తించని అధికారులు
సోయాను మాత్రమే పరిగణనలోకి
తీసుకుంటున్న అధికారులు
రెండు పంటలకు పరిహారం
ఇవ్వాలంటున్న రైతులు

‘కంది’ పంటకు కష్టం.. నష్టం