
వంతెనలకు పట్టిన గ్రహణం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజీవాడి–కల్వరాల్ గ్రామాల మధ్య గతంలో నిర్మించిన వంతెనకు మళ్లీ గ్రహణం పట్టుకుంది. కొన్ని సంవత్సరాలు వంతెన కోసం అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకోగా ఐదేళ్ల క్రితం వంతెన నిర్మాణం జరిగింది. ఇటీవల కురిసిన అకాల వర్షానికి బ్రిడ్జికి ఇరు వైపులా వేసిన మట్టి వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోవడంతో కేవలం వంతెన మిగిలింది. దీంతో ఈ రెండు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. ఈ బ్రిడ్జి నిర్మించడం వల్ల రెండు గ్రామాల ప్రజలకు కొంత సౌకర్యంగా ఉండేది. రైతులకు దూర భారం తగ్గింది. కానీ మట్టి పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే మండల కేంద్రం శివారు– తిర్మన్‌పల్లి మధ్య గల తుంగాగు వద్ద నిర్మించిన వంతెన వరద ఉధృతికి బుంగ ఏర్పడడంతో బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ రోడ్డు గుండా రామారెడ్డి, మాచారెడ్డి మండలాలకు వాహనాదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రధాన రహదారిపై వంతెన ప్రమాదకరంగా మారినప్పటికి ఇప్పటి వరకు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పరిస్థితిని పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని వారు వాపోతున్నారు. ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా అని ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు.
ఇరువైపులా కోతకు గురైన రోడ్లు
పద్మాజీవాడి–కల్వరాల్ గ్రామాల మధ్య
నిలిచిన రాకపోకలు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న
ఇరు గ్రామాల ప్రజలు
ప్రమాదకరంగా
తిర్మన్‌పల్లి తుంగాగు బ్రిడ్జి

వంతెనలకు పట్టిన గ్రహణం