
దోమల దండొచ్చె జాగ్రత్త..
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య విస్తీర్ణాధికారిగా పనిచేస్తున్న బి.చలపతి విశ్వకర్మ వివిధ అంశాలపై ప్రజలను చైతన్యపరిచే పాటలు రాస్తూ పాడుతున్నారు. ఇటీవల కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ‘జాగ్రత్త జాగ్రత్త దోమలదండొచ్చె.. దండిగా దాడులు చేయవచ్చే..’ అన్న గేయాన్ని రూపొందించారు. కరోనా కాలంలో ‘కరోనా మహమ్మారి కాచి ఉంది కాటువేయ.. కంటికి కానరాని పాడు రోగము ఒంటికి కీడు చేయు పాడు రోగమూ’ అంటూ గేయాన్ని పాడి ఆడియో ద్వారా అవగాహన కల్పించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ‘తల్లిపాలే తరగని ధనం.. ప్రతి శిశువు తనువుకు..’ అనే గేయాన్ని ఆలపించారు. ‘పురుటి నొప్పుల కాన్పులే మేలు ఆపరేషన్ కాన్పులకంటే ’ అంటూ సిజేరియన్ల వల్ల అనర్థాలపై పాట రాసి పాడారు. కుటుంబ నియంత్రణ కోసం ‘ఎందాకా ఎదురు చూపులు ఏ కొడుకు కోసమో కోటి ఆశలతో’ అనే గేయం, మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం అందించే పథకాలను వివరిస్తూ ‘మాతృత్వపు మాధుర్యము మధుర స్మృతులను నింపగా’ అనే పాట రాశారు. ఇలా అనేక ఆరోగ్య సమస్యలపై, సామాజిక సమస్యలపై ఆయన పాటలు రాసి పాడుతూ ఆయా అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.