
స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు
భిక్కనూరు : న్యాయస్థానం ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు చేస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క తెలిపారు. ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన సీతక్కకు మంగళవారం బస్వాపూర్ గ్రామశివారులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ధ్రువీకరణ పత్రంతో ఇంటికి ఇసుక, మొరం తీసుకోవచ్చన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరయ్యేంతవరకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించేందుకు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, నాయకులు కుంట లింగారెడ్డి, భీంరెడ్డి, అనంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సందీప్, శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
నిరంతర ప్రక్రియ
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క