
సీతక్క చొరవ చూపేనా?
మంత్రి పర్యటన ఇలా..
● జిల్లాను వేధిస్తున్న సమస్యలు
● ఇన్‌చార్జి మంత్రి పర్యటనపై ప్రజల్లో ఆశలు
● నేడు జిల్లా కేంద్రానికి రాక
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తొలిసారి జిల్లాకు రానున్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ అంశాలపై నిర్వహించే సమీక్ష సమావేశాల్లో ఆమె పా ల్గొననున్నారు. ఇన్‌చార్జి మంత్రిగా తొలిసారి జిల్లా కు వస్తున్న సీతక్కపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్యల తిష్ట..
జిల్లాలో అనేక సమస్యలు తిష్టవేశాయి. వర్షాకాలం ప్రారంభమైనా సరైన వర్షాలు లేకపోవడంతో పలు ప్రాంతాలలో తాగునీటి నెలకొంది. ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు చాలా ప్రాంతాలకు సరఫరా కావడం లేదు. జిల్లా కేంద్రంలో మూడు, నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోంది. చాలా గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య వేధిస్తోంది. సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. డెంగీ కేసులు పెరుగుతున్నాయి. చాలా ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యూరియా కొరతతో చాలాచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పలు గ్రామాలు, గిరిజన తండాలకు తారు రోడ్లు లేవు. వర్షం కురిస్తే మట్టి రోడ్లు బురదమయంగా మారి నడవడానికీ ఇబ్బందికరంగా మా రుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అనేక సమస్యలు ఉన్నాయి. నిర్మించుకునేందుకు ఆసక్తి ఉన్న వారి పేర్లు జాబితాల్లో రాకపోవడంతో కొందరు నిరాశకు గురవుతు న్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక దొరక్క పనులు ముందుకు సాగడం లేదు. కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణానికి అట వీ చిక్కులు ఉన్నా యి. వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
అద్దె భవనాల్లో కార్యాలయాలు..
జిల్లాలో చాలాచోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భ వనాల్లో కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల నిధులు లే క భవనాల నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలా యి. అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కేంద్రాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో పలు అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసినా వాటికి సొంత భవనాలు నిర్మించలేదు. దీంతో వందకుపైగా పంచాయతీలకు సరైన వసతి లేదు. కొన్నిచోట్ల స్కూల్ భవనాల్లో, మరికొన్ని చోట్ల గుడిసెల్లో, ఇంకొన్ని చోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పంచాయతీలుగా ఏర్పడిన తండాలలో దాదాపు ఏ ఒక్క దానికీ సొంత భవనం లేదు. గతంలో చేసిన పనులకు బిల్లులు రాక తాజా మాజీ సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
స్కూళ్ల పరిస్థితి దయనీయం..
జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన స్కూల్ భవనాల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలాయి. బి ల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపే శారు. దీంతో కొన్నిచోట్ల పాఠశాలలు చెట్ల కింద కొనసాగుతున్నాయి. బిల్లులు చెల్లిస్తే గానీ పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. చాలాచోట్ల సరిపడా తరగతి గదులు లేకపోవడంతో ఇబ్బందుల మధ్య చదువులు కొనసాగుతున్నాయి. ఇన్‌చార్జి మంత్రిగా జిల్లాలో ఆయా సమస్యలపై అధికారులతో సమీక్షించి వాటికి పరిష్కారం చూపుతారని ప్రజలు ఆశిస్తున్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మంగళవారం కామారెడ్డిలో పర్యటిస్తారని జిల్లా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ఉదయం 10 గంటలకు జిల్లాకేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో వన మహోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు. 10.45 గంటలకు కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతి, భూభారతి సమస్యల పరిష్కారం, విత్తనాలు, ఎరువుల సరఫరా, ఆయిల్ ఫార్మింగ్ పురోగతి, టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్షిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించే మహిళా సదస్సులో పాల్గొంటారని, సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారని పేర్కొన్నారు.