
‘క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి’
లింగంపేట: క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీసు లకు సూచించారు. సోమవారం ఆయన లింగంపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. రోల్ కాల్‌ను పరిశీలించి, హాజరైన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించే రోల్ కాల్ ప్రాముఖ్యతను వారికి వివరించారు. దర్యాప్తు ప్రక్రియలో కానిస్టేబుళ్ల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి కేసును సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. బ్లూ కోల్ట్స్, పెట్రోకార్ విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీపీవోలు తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ, సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలన్నారు. డయల్ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటూ ప్రజలలో పోలీస్ శాఖపై విశ్వాసం పెరిగేలా చూడాలని సూచించారు.
కాయితీ తండా శివారులో
చిరుతల సంచారం
గాంధారి: కాయితీ తండా శివారులోని అటవీ ప్రాంతంలో వారం రోజులుగా చిరుత సంచరిస్తోందని తండావాసులు తెలిపారు. మూడు రోజుల క్రితం పేట్‌సంగెం మాజీ సర్పంచ్ జగ్మల్ నాయక్‌కు చెందిన రెండు గొర్రె పొట్టేళ్లపై దాడిచేసి ఎత్తుకుపోయిందని పేర్కొన్నారు. మరో రైతుకు చెందిన ఆవుపై దాడి చేసి చంపే ప్రయత్నం చేయగా కాపరులు అరవడంతో చిరుత అడవిలోకి పరుగులు తీసిందని తెలిపారు. ఆవు గొంతుపై తీవ్ర గాయాలయ్యాయన్నారు. అడవిలో రెండు, మూడు చిరుతలు సంచరిస్తున్నాయన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. చిరుతను బంధించాలని కోరుతున్నారు.
జిల్లా వ్యవసాయ అధికారిగా మోహన్‌రెడ్డి
కామారెడ్డి క్రైం: జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ నిజామాబాద్ ఆత్మ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వి కారాబాద్ డీఏవోగా ఉన్న మోహన్‌రెడ్డి బదిలీపై వచ్చారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన డీఏవో మోహన్‌రెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో బదిలీ పై వెళ్తున్న తిరుమల ప్రసాద్ పాల్గొన్నారు.
‘ఇందిరమ్మ’లో రాష్ట్రంలో నాలుగోస్థానం
కామారెడ్డి టౌన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉందని హౌసింగ్ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి తెలిపారు. జిల్లాకు మొత్తం 11,618 ఇందిరమ్మ ఇళ్లు మంజూరవగా.. ఇప్పటివరకు 5,435 నిర్మాణాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. 47 శాతం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉన్నామని తెలిపారు. ప్రారంభమైనవాటిలో 1,013 బేస్‌మెంట్ లెవల్‌లో ఉండగా.. 65 రూఫ్ లెవల్, 30 స్లాబ్ లెవల్ వరకు పనులు పూర్తయ్యాయని వివరించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలన్నారు. క్లస్టర్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులు నిరంతరం నిర్మాణాలను పర్యవేక్షించాలని సూచించారు.
‘దివ్యాంగులకు
ఆర్థిక ప్రోత్సాహం’
కామారెడ్డి అర్బన్: దివ్యాంగులకు ఆర్థిక పునరావాస పథకం (ఎకనమిక్ రిహాబిలిటేషన్ స్కీం) కింద జీవనోపాధి అవకాశాలు కల్పించడానికి రుణాలు ఇప్పించనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికిగానూ జిల్లాకు 31 యూనిట్లు మంజూరు చేశారని, అర్హులైన దివ్యాంగులు అన్‌లైన్‌లో ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బ్యాంకు లింకేజీ, బ్యాంకు లింకేజీ లేకుండా రూ. 50 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

‘క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి’