
కోరిన కోరికలు తీర్చే అల్లూరమ్మ..
లింగంపేట మండలంలోని కేశాయిపేట –కోమట్‌పల్లి గ్రామాల శివారులో చెరువుగట్టున ఉన్న అల్లూరమ్మ ఎన్నో కుటుంబాలకు ఇంటిదేవతగా బాసిల్లుతోంది. సంతానం లేని దంపతులు మొక్కుకుంటే సంతానం కలుగుతుందన్న నమ్మకం ఉంది. ఇక్కడకు వచ్చి ముడుపులు కడితే కోరికలు తీరుతాయంటారు. ఆలయానికి ఆది, సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అప్పట్లో చెట్టుకింద ఉన్న అమ్మవారికి భక్తులు దాదాపు రూ. 35 లక్షలు జమ చేసి, ఆలయాన్ని నిర్మించారు. మొక్కులు తీర్చుకునేందుకు మేకలు, గొర్రెలు, కోళ్లు కోస్తారు. ఏటా జూన్ మొదటి వారంలో ఆలయం వద్ద ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహి స్తారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. కుస్తీపోటీలు నిర్వహిస్తారు. లింగంపేట మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల మండలాలు, పొరుగున ఉన్న మెదక్ జిల్లాకు చెందిన వారు కూడా తమ సంతానానికి అల్లూరు, అల్లూరయ్య, అల్లూరమ్మ అన్న పేర్లు పెట్టుకుంటారు.