
వేతనం లేని ఉపాధి
ఎల్లారెడ్డిరూరల్: ఉపాఽధిహామీ కూలీలకు ఉపాధి క ల్పించే సిబ్బంది వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలుగా వేతనాలు అందకపో వడంతో కుటుంబాల పోషణ భారంగా మారిందని ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్లు(టీఏలు), ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎఫ్‌ఏలు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 2,50,423 జాబ్‌కార్డులు ఉండగా వీటి పరిధిలో 4,76,500 మంది కూలీలు ఉన్నారు. వీరిలో గత జూన్ వరకు రోజుకు సగటున 42 వేల మంది కూలీలు పనులు చేశారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 85,284 మంది కూలీలు 10 లక్షల 92 వేల పని దినాలను పూర్తి చేశారు. వీరితో జిల్లాలో 65 మంది టీఏలు, 325 మంది ఎఫ్‌ఏలు పనులను గుర్తించి పనులను చేయించారు. అయితే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబందించిన వేతనాలు రాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని టీఏలు, ఎఫ్‌ఏలు ఆవేదన చెందుతున్నారు. వీరితోపాటు జిల్లాలో 14 మంది ఏపీవోలు, 9 మంది ఈసీలు, 48 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 22 మంది అటెండర్లు ఉన్నారు. వీరికి సైతం గత రెండు నెలల నుంచి వేతనాలు అందలేదు. అధికారులు స్పందించి సిబ్బంది వేతనాలు అందేలా చర్యలను తీసుకోవాలని వారు కోరుతున్నారు.
టీఏలు, ఎఫ్‌ఏలకు
మూడు నెలలుగా అందని జీతాలు
ఏపీవో, సీవో సిబ్బందికి
రెండు నెలలుగా..
ఇబ్బందులు పడుతున్న సిబ్బంది