
అయ్యో.. రైతన్న కష్టం వృథాయేనే!
ఎల్లారెడ్డి: ఆరుగాలం కష్టించి పండించిన పంట వానల వల్ల పనికిరాకుండా పోవడంతో రైతన్న కళ్లు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. చేతికొచ్చిన పంటను సకాలంలోనే కొనుగోలు కేంద్రాలకు తరలించినా హమాలీలు లేరంటూ, లారీలు రావడం లేదంటూ నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాలలో ఎండకు ఎండి వానకు నానిన పంట మొలకలెత్తి పనికిరాకుండా పోయింది. దీంతో రైతన్న కష్టం వృథాగా మారిందని పలువురు పేర్కొంటున్నారు.
మిగిలిపోతున్న తడిచిన ధాన్యం..
ఎల్లారెడ్డి మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్న ధాన్యం రాశులు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిచి ముద్దయ్యాయి. తడిచిన ధాన్యం ఉంటే రైస్ మిల్లర్లు తిప్పి పంపడం లేదా తరుగు పేరిట చేస్తున్న లూటీని దృష్టిలో పెట్టుకుని రైతులు పొడి ధాన్యాన్ని మాత్రమే తూకం చేయిస్తున్నారు. ప్రతీ రైతు ధాన్యంలో క్వింటాల్ నుంచి ఐదు క్వింటాళ్ల వరకు మిగిలిపోతున్న తడిచిన ధాన్యాన్ని ఎవరికి కొనుగోలు చేయాలో కొనుగోలు కేంద్రం సిబ్బంది తెలపడం లేదు. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షానికి తడిచిన ధాన్యం అడుగుభాగాన మొలకలెత్తాయి. మొలకెత్తిన ఈ ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారంటూ రైతులు బావురుమంటున్నారు. తడిచిన ధాన్యాన్ని ఏదో ఒక ధరకు రైస్‌మిల్లర్లకు అమ్మేసుకోవాలని సిబ్బంది రైతులకు సలహా ఇస్తున్నట్లు సమాచారం.
నమోదులో కూడా తీవ్ర జాప్యం..
రైతులు అమ్మిన ధాన్యానికి 48 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు వస్తాయని నాయకులు, అధికారులు చెబుతున్న ప్రకటనలు వాస్తవానికి జరగడం లేదు. ధాన్యాన్ని మిల్లుకు తరలించాక రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సిన కేంద్రం నిర్వాహకులు జాప్యం చేస్తున్నారు. దీనివల్ల అన్ని పత్రాలు ఇచ్చినా రోజుల తరబడి ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరిపి, మిల్లులకు తరలించి, రైతులకు డబ్బులు వచ్చేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
రైస్ మిల్లర్ల దోపిడీ..
వానలకు తడిచి, మొలకెత్తిన
కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం
సకాలంలో తూకాలు జరుగక..
లారీలు రాక.. నాశనమైన పంట
మొలకెత్తిన ధాన్యాన్ని ఎవరికి అమ్మాలి..
కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యానికి తూకం జరిగినా, లారీలు రాకపోవడంతో తరలించడం జరగలేదు. గత కొద్ది రోజుల క్రితం పడిన వర్షానికి తడిచిన ధాన్యం మొలకలెత్తింది. ఇలా మొలకెత్తిన ధాన్యాన్ని ఎవరికి అమ్ముకోవాలి. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తమను ఆదుకోవాలి.
– సిద్దు, రైతు, లింగారెడ్డిపేట
తడిసిన ధాన్యాన్ని కొంటాం..
వర్షాలకు కొనుగోలుకేంద్రాల్లో తడిసిన ధాన్యా న్ని తప్పకుండా కొనుగోలు చేస్తాం. అయితే రైతులు తడచిన ధాన్యాన్ని ఎండపెట్టి విక్రయించాల్సి ఉంటుంది. మొలకత్తిన ధాన్యం విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 594 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసాం. ఇంకా ఐదు వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా శుక్రవారం 2500 టన్నులు కొనుగోలు చేశాం. – మల్లికార్జునరావు,
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
కొన్ని రోజులు కొనుగోళ్లు జరగక ఇబ్బంది పడ్డ రైతులు నేడు హమాలీ, లారీల సమస్యలతో పంట నాశనం కావడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. తీరా లారీలు వచ్చి కాంటాలు జరిగినా తరుగు పేరిట రైస్ మిల్లర్లు చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోయింది. ధాన్యంలో ఔటానా(బియ్యం శాతం) రావడం లేదంటూ రైస్ మిల్లర్లు ప్రతీ లారీకి 20 నుంచి 40 సంచుల వరకు తరుగు కింద తీసి వేస్తున్నారు. ఇటీవల ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ఒక పారా బాయిల్డ్ రైసుమిల్లు వారు 680 సంచులు ఉన్న లారీ నుంచి 40 సంచులను తరుగు కింద తీసివేశారు. దాదాపు 16 క్వింటాళ్ల ధాన్యం తరుగు కింద తీసివేస్తే తాము ఎలా బతికేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా సదరు రైస్‌మిల్లు యజమానితో మాట్లాడి తరుగు తక్కువ చేయిస్తామని సమాధానమిచ్చారు. రైతులు జల్లెడ పట్టకుండా నేరుగా ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారని ఇందువల్ల బియ్యం పర్సంటేజ్ రావడం లేదంటూ మిల్లర్లు కోత పెడుతున్నారని అధికారులు అంటున్నారు.

అయ్యో.. రైతన్న కష్టం వృథాయేనే!

అయ్యో.. రైతన్న కష్టం వృథాయేనే!