
జంగమాయిపల్లిలో రొయ్యల చెరువులు
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని జంగమాయిపల్లిలో ఐదు ఎకరాలలో రొయ్యల చెరువును మహిళా రైతు రజితారెడ్డి ఏర్పాటు చేసింది. రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎల్లారెడ్డి మండలంలోని జంగమాయిపల్లి గ్రామానికి చెందిన రజిత ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని నెల్లూరు, చీరాల, బాపట్ల తదితర ప్రాంతాలకు విహార యాత్రకు వెళ్లింది. అక్కడి రైతులు సాగు చేస్తున్న రొయ్యల చెరువును చూసి వివరాలు తెలుసుకుంది. రైతుల వద్ద వారు సాగు చేస్తున్న విధానం, పద్ధతులను తెలుసుకుని గత నెలలో రొయ్యల చెరువును ఏర్పాటు చేసింది.
మూడు నెలల్లో రొయ్యల పంట..
రొయ్యలలో వనామి, టైగర్‌లాంటి రకరకాల రొయ్యలు ఉంటాయి. వీటిలో రజిత వనామి అనే రకానికి చెందిర రొయ్యలను సాగు చేస్తున్నది. ఐదు ఎకరాల సాగులో ఉన్న రొయ్యల చెరువులో 11 లక్షల రొయ్య పిల్లలను ప్రస్తుతం సాగు చేస్తున్నారు. రొయ్యలకు ప్రతి రోజుల నాలుగు పూటలు దాణాను వివిధ రకాల పద్ధతుల్లో అందిస్తున్నారు. వీటిని జాగత్త్రగా కాపాడుకోవాల్సి ఉంటుంది. 24 గంటల పాటు వెలుతురు, ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. పాములు రాకుండా ఫెన్సింగ్, పక్షులు రాకుండా నెట్ ఏర్పాటు చేశారు. వెంట్రుక మందంలో ఉన్న మీసాల రొయ్యలు మూడు నెలల పాటు వాటికి దాణా అందిస్తారు. మూడు నెలల తరువాత వాటిని విక్రయిస్తారు. కిలో రూ. 350 ధర పలకడంతో వాటి ద్వారా లాభాలను ఆర్జించవచ్చు. రొయ్యల విక్రయాలను హైదరాబాద్, కోల్‌కత్తా ఏజెన్సీ ద్వారా విదేశాలకు ఎక్స్‌పోర్టు చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఐదు ఎకరాలలో రొయ్యలను
సాగు చేస్తున్న మహిళా రైతు రజిత
ఆదర్శంగా నిలుస్తున్న వైనం
ప్రభుత్వం రుణాలను అందించాలి
ఆంధ్రా రైతులను ఆదర్శంగా తీసుకుని రొయ్యల చెరువును ఏర్పాటు చేశాను. తెలంగాణాలో రొయ్యలను తినే వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దొరకక పోవడంతో ఇతర ప్రాంతాల నుంచి అధిక ధరలకు కొనుక్కుంటున్నారు. రొయ్యలు ఎక్స్‌పోర్టు కావడంతో ఇవి లభించడం చాలా అరుదు. తన వ్యవసాయ పొలంలో రొయ్యల చెరువులను తవ్వి రొయ్యల సాగు చేస్తున్నాను. ఇదే మొదటి పంట. లాభాలు రావాలని కోరుకుంటున్నాను. రొయ్యల చెరువులకు సైతం ప్రభుత్వం రుణాలను అందిస్తే మరింత మంది రైతులు రొయ్యల చెరువులను సాగు చేస్తారు. – రజిత, మహిళా రైతు, జంగమాయిపల్లి

జంగమాయిపల్లిలో రొయ్యల చెరువులు

జంగమాయిపల్లిలో రొయ్యల చెరువులు