
విపత్తులపై అప్రమత్తం చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● జిల్లా కేంద్రంలో నేడు మాక్‌డ్రిల్
కామారెడ్డి క్రైం: వర్షాకాలంలో విపత్తులు, వరదలు వచ్చే అవకాశాలు ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులపై అవగాహన కల్పించేందుకు మంగళవారం జిల్లాకేంద్రంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వరద లు వచ్చినప్పుడు ప్రజలను సురక్షత ప్రాంతాలకు తరలించడం, అప్రమత్తం చేయడం వంటి కార్యక్రమాలను మాక్ డ్రిల్ ద్వారా వివరించనున్నట్లు తెలిపారు. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం అందించే సహాయ, సహకారాలను గురించి ప్రజలకు వివరించాలన్నారు. అధికారులు తప్పనిసరిగా మాక్‌డ్రిల్ లో పాల్గొనాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఏఎస్పీ నరసింహారెడ్డి, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రావణ్ కుమా ర్, ఆర్‌అండ్‌బీ ఈఈ రవిశంకర్, డీపీవో మురళి, జిల్లా ఫైర్ అధికారి సుధాకర్, మున్సిపల్ కమిషనర్లు రాజేందర్, శ్రీహరి, మహేష్ పాల్గొన్నారు.
దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి
కామారెడ్డి క్రైం : రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాల ని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వచ్చిన 41,547 దరఖాస్తులను పరిశీలన నిమిత్తం బ్యాంకులకు పంపించామన్నారు. వాటిలో 15,515 దరఖాస్తులను బ్యాంకర్లు పరిశీలించారన్నారు. మిగిలిన వాటిని రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంకుల నుంచి సమాచారాన్ని వీలైనంత త్వరగా తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చందర్, డీఆర్‌డీవో సురేందర్, బీసీ సంక్షేమ అధికారి స్రవంతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ పాల్గొన్నారు.