
ఎస్సారెస్పీ గేట్ల మరమ్మతులు పూర్తి
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మిగులు జలాలను గోదావరిలోకి వదులుటకు నిర్మించిన వరద గేట్లకు మరమ్మతులు పూర్తయ్యాయి. ప్రస్తుతం భద్రంగా ఉన్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణ కాలంలో 42 వరద గేట్లను నిర్మించగా, 1983లో తొలిసారిగా ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను గోదావరిలోకి వదిలారు. అప్పటి నుంచి ఉపయోగంలో ఉన్నటువంటి వరద గేట్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు ఎప్పుడూ చేపట్టలేదు. ప్రతి సంవత్సరం వేసవిలో మెయింటెనెన్స్ చేపట్టి వదిలేశారు. దీంతో కొన్ని గేట్లు టన్ బక్కెలు చెడిపోయి, రోప్ తెగిపోయి ప్రమాదకరంగా మారాయి. గేట్లు ఎత్తితే లేవకుండా, దించితే దిగకుండా ఉండిపోయాయి. ఈక్రమంలో గత ప్రభుత్వ హయాంలో 2022లో వరద గేట్ల పూర్తిస్థాయి మరమ్మతుల కోసం రూ.17.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. అప్పటి నుంచి ప్రారంభమైన పనులు ఇప్పటికి పూర్తయ్యాయి.
తిప్పలు తప్పినట్టే..
42 వరద గేట్లను ప్రస్తుతం పూర్తిస్థాయిలో మరమ్మతులు పూర్తి కావడంతో అన్ని వరద గేట్లను ఎత్తినా ఎలాంటి తిప్పలు ఉండవని ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో గేట్ల నిర్వహణ చేపట్టకపోతే మళ్లీ కథ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. గేట్ల రోప్‌లకు గ్రీస్, గేట్లకు రంగు వేయడం మరిచిపోతే మళ్లీ టన్ బక్కెలు, రోప్‌లు చెడిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఏటేటా మెయింటెనెన్స్‌కు నిధులు మంజూరు చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. వరద గేట్ల ద్వారా 16 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలేలా నిర్మించారు. 1983లోనే తొలిసారి గరిష్టంగా అంత స్థాయిలో నీటి విడుదల చేపట్టారు. తరువాత అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. తరువాత కాలంలో గరిష్టంగా 6.5 లక్షల క్యూసెక్కుల నీటినే గోదావరిలోకి వదిలినట్లు రికార్డులు తెలుపుతున్నాయి.
2022లో నిధులు మంజూరు
మూడేళ్లకు పూర్తయిన పనులు
ఎలాంటి ఇబ్బంది లేదు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 42 వరద గేట్లకు మరమ్మతులు పూర్తయ్యాయి. ప్రస్తుతం గేట్ల ఆపరేటింగ్‌లో ఎలాంటి ఇబ్బంది లేదు. వరదలు వచ్చినా గోదావరిలోకి నీటిని వదులుటకు 42 వరద గేట్లను వినియోగించుకోవచ్చు.
– వంశి, డ్యాం ఏఈఈ, ఎస్సారెస్పీ