
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
బోధన్‌టౌన్(బోధన్): రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రతిఒక్కరూ కృషి చేయాలని, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ట్రాన్స్‌పోర్ట్ జిల్లా అఽధికారి ఉమామహేశ్వర్‌రావ్ అన్నారు. పట్టణంలోని ఇందూర్ హైస్కూల్‌లో శనివారం ట్రస్మా ఆధ్వర్యంలో ట్రాన్స్‌పోర్ట్, అగ్నిమాపక శాఖ, ట్రాఫిక్ శాఖలు సంయుక్తంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాక్ డ్రిల్ చేసి చూపించారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలను వివరించారు. అనంతరం ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల కరపత్రాలను ఆవిష్కరించారు. ఎంవీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, అగ్నిమాపక శాఖ అధికారి సుభాష్, ఎంఈవో నాగయ్య, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడాలి కిశోర్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.