
వేతనం అందేదెప్పుడో?
నాగిరెడ్డిపేట : ఇటీవల నియమితులైన 2008 డీఎ స్సీ కాంట్రాక్ట్ టీచర్లు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. విధుల్లో చేరి మూడు నెలలు దాటినా ఇంతవరకు వేతనాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ప్రభు త్వం డీఎస్సీ–2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ బేసిస్ పై ఎస్జీటీ ఉద్యోగాలు ఇచ్చింది. వీరికి నెలకు రూ.31,040 చొప్పున గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించింది. ఫిబ్రవరి 15న వీరికి నియామక పత్రాలు అందించింది. జిల్లాలో 72 మంది కాంట్రా క్ట్ ఎన్జీటీలుగా నియమితులయ్యారు. అప్పటివరకు ప్రైవేట్ పాఠశాలలతోపాటు ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకున్న వారు ప్రభుత్వ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత ఇప్పటివరకు ఒక్క నెల వేతనం కూడా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వేతనాలు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.
విధుల్లో చేరినప్పటి నుంచి అందని వేతనాలు
డీఎస్సీ–2008 కాంట్రాక్ట్ టీచర్ల
ఎదురుచూపులు