
అధ్వానంగా ఆటో నగర్
నిజామాబాద్ సిటీ: నగర శివారులోని ఇండస్ట్రియల్ కారిడార్ ‘ఆటో నగర్’ను పట్టించుకునే వారు కరువయ్యారు. స్థానిక సమస్యలను పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఆటో నగర్ అధ్వానంగా మారింది. కనీస వసతులు లేక, కంకర రోడ్లు, పారిశుధ్య లోపంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
40 ఏళ్లుగా సమస్యలతో సావాసం..
ఇండస్ట్రియల్ పనుల కోసం ప్రత్యేకంగా 1982లో అప్పటి ప్రభుత్వం నగర శివారులో 26 ఎకరాల స్థలం కేటాయించింది. దాని చుట్టూ ప్రహరీ ఏర్పాటుచేసింది. ఇందులో దాదాపు 200 వరకు పలు రకాల ఇండస్ట్రియల్ కార్యాలయాలు, వర్క్‌షాపులు ఉన్నాయి. వీటిపై ఆధారపడి దాదాపు 2వేల మంది ఆధారపడి పనులను చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద కారిడార్‌లో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆటో నగర్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. 40 ఏళ్ల క్రితం చేసిన పనులే తప్ప కొత్తగా ఎలాంటి అభివృద్ధి లేదు. సీసీ డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరు మొత్తం రోడ్లమీదనే పారుతోంది. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కుంటలను తలపిస్తున్నాయి. పాత రోడ్లు పాడైపోయి కంకర తేలి అధ్వానంగా మారాయి. చెత్త సేకరణ జరగడం లేదు. పాడైపోయిన షెడ్‌కు వచ్చిన కార్లు కూడా రోడ్డుమీదనే పార్కు చేస్తున్నారు. దీంతో రోడ్లు ఇరుకుగా మారిపోయాయి.
సమస్యలపై వినతులు..
ఆటోనగర్ ఏరియాలో పారిశుధ్య పనులు చేపట్టాలని దుకాణదారులు ఇటీవల మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కమిషనర్ స్పందించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, చెత్త సేకరణ చేపడతామని తెలిపారు. వర్షపునీరు బయటకు వెళ్లేలా, సీసీ డ్రెయినేజీల నిర్మాణం కోసం అంచనాలు వేయాలని ఇంజినీరింగ్ డీఈ సుదర్శన్‌రెడ్డి, ఏఈ షాదుల్లాను ఆదేశించారు. పారిశుధ్య పనులు చేపట్టాలని అసిస్టెంట్ కమిషనర్ జయకుమార్‌ను ఆదేశించారు. దీంతో వారు ఆటోనగర్ వెళ్లి దుకాణదారులతో మాట్లాడారు. అలాగే ఆటోనగర్ అభివృద్ధి కోసం ప్రత్యేక ఫండ్ కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీని దుకాణదారులు కోరారు. ఆయన స్పందించి ఎస్టిమేషన్ వేయించాలని అధికారులకు సూచించారు. దీంతో త్వరలో సమస్యలు తీరనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సీసీ రోడ్లు లేక వాహనదారుల
ఇబ్బందులు
పరిసరాల్లో పేరుకుపోయిన
చెత్తాచెదారం
పట్టించుకోని అధికారులు
ఎస్టిమేషన్ వేయించాం..
ఆటోనగర్ ఇండ్రస్ట్రియల్ ఏరియా మున్సిపల్ పరిధిలోకి రాదు. దానికి స్పెషల్ స్టేటస్ ఉంది. అయినా శానిటేషన్ పనులు చేయిస్తున్నాం. సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణం, వర్షపునీరు బయటకు వెళ్లేలా ఏర్పాట్ల కోసం అధికారులను పంపి ఎస్టిమేషన్స్ వేయించాం.
– దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్

అధ్వానంగా ఆటో నగర్

అధ్వానంగా ఆటో నగర్