
పెన్షనర్ల న్యాయపరమైన సమస్యలు పరిష్కరిస్తా
నిజామాబాద్‌నాగారం: పెన్షనర్లకు న్యాయపరమైన సమస్యలుంటే పరిష్కరించడానికి కృషి చేస్తానని జిల్లా న్యాయసేవ సమితి కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్‌భాస్కర్ తెలిపారు. నగరంలోని న్యాయసేవాధికారి సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయనను తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్‌పర్సన్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి పలు సమస్యలపై చర్చించారు. పెన్షనర్స్–సీనియర్ సిటిజెన్స్ భవనాన్ని కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌గా గుర్తించినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రావు తెలిపారు. కుటుంబ తగాదాలు, నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులు, వృద్ధులు వారి సమస్యలు, భార్యాభర్తల వివాదాలు, సివిల్ తగాదాలు ఇవన్నీ కూడా ఈ మీడియేషన్ కేంద్రంలో చర్చించి పరిష్కార మార్గాన్ని చూపిస్తారని, ఇది జిల్లా న్యాయసేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈవీఎల్ నారాయణ, లావు వీరయ్య, జీవన్ రావు తదితరులు ఉన్నారు.
తహసీల్దార్ల బదిలీ
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ ఎన్నికల్లో పలువురు తహసీల్దార్లను బదిలీ చేయగా, ప్రస్తుతం వారిని సొంత జిల్లాలకు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు వచ్చే తహసీల్దార్లు శ్రీనివాస్, సతీష్‌రెడ్డి, ముజీబుద్దీన్, ప్రసాద్, వీర్‌సింగ్, ఇతర జిల్లాలకు వెళ్లే వారు మాలతి, మల్లయ్య, హిమబిందు, జానకి, పెద్దరాజు, నాగార్జున, ప్రభాకర్, గజానన్, రహిమోద్దీన్, సునీత, ఆంజనేయులు ఉన్నారు.
ప్రశాంతంగా ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 7189 మంది విద్యార్థులకు గానూ 6709 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 829 మంది విద్యార్థులకు గానూ 724 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని తెయూ రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తనిఖీ చేశారు.

పెన్షనర్ల న్యాయపరమైన సమస్యలు పరిష్కరిస్తా