
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే హత్య
ఎల్లారెడ్డి: వివాహేతర సంబంధానికి సహజీవనం చేస్తున్న భాగస్వామి అడ్డు ఉన్నాడని ప్రియుడితో కలిసి మహిళ హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎల్లారెడ్డి మండలంలో చోటుచేసుకున్న ఘటన వివరాలను శుక్రవారం సీఐ రవీందర్ నాయక్ వెల్లడించారు. ఎల్లారెడ్డి మండలంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన పౌలవ్వ భర్త కొన్నేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆమె ఒంటరిగా జీవిస్తుండగా ఎల్లారెడ్డిలోని గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ అహ్మద్ (47)తో పరిచయం ఏర్పడింది. దీంతో అహ్మద్ తన భార్య, పిల్లలను వదిలేసి పౌలవ్వతో సహజీవనం చేశాడు. కొద్ది నెలల క్రితం పౌలవ్వకు సాతెల్లి గ్రామానికి చెందిన కుర్మ సాయిలుతో పరిచయం ఏర్పడింది. సాయిలుతో చనువుగా ఉంటున్న పౌలవ్వకు షేక్ అహ్మద్ అడ్డుగా వస్తున్నాడని భావించి అతడి అడ్డును తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో జనవరి 24న అహ్మద్‌ను ప్రియుడు సాయిలుతో కలిసి ఎల్లారెడ్డి శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అనంతరం అతిగా మద్యం తాగిన షేక్ అహ్మద్‌ను పౌలవ్వ, ప్రియుడు సాయిలు కలిసి గొంతు నులిమి, మర్మాంగాలపై దాడి చేయడంతో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇదిలా ఉండగా అహ్మద్ కనబడటం లేదని అదే నెల 28న పౌలవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టగా పౌలవ్వ కాల్ డేటా ఆధారంగా కేసును చేధించారు. అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా ఉన్న మృతుడి కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఎస్సై మహేష్, పీసీలు ఇద్రిస్, సిద్దు, అనిల్, హోంగార్డు ప్రసాద్‌లను ఎస్పీ అభినందించారని, వీరికి రివార్డు ఇవ్వనున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, వెండి కడియం, టీవీఎస్ ఎక్సెల్ వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
ప్రియుడితో కలసి సహజీవన
భాగస్వామిని హతమార్చిన మహిళ
లింగారెడ్డిపేట వ్యక్తి మిస్సింగ్
కేసును ఛేదించిన పోలీసులు
వివరాలను వెల్లడించిన
ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్