
నవీపేటలో ఆటో చోరీ
నవీపేట: మండల కేంద్రంలో శుక్రవారం ఆటో చోరీకి గురైనట్లు ఎస్సై వినయ్ తెలిపారు. నవీపేటకు చెందిన మంజుసింగ్ తన ఆటోను సంత సమీపంలో పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికి వచ్చి చూసేసరికి ఆటో లేకపోవడంతో, చోరీకి గురైందని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖలీల్‌వాడి: నగరంలోని బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు నాలుగోటౌన్ ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. మృతుడు నీలం రంగు ఫుల్ షర్ట్ ధరించి ఉన్నారని తెలిపారు. వయస్సు 55నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. గత 3 రోజుల నుంచి ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతూ రోడ్డుపై పడుకుంటున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి సంబంధించిన వారు ఎవరైన ఉంటే నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్‌లో లేదా, ఫోన్ నెంబర్ 8712659840, 8712659719కు సంప్రదించాలని అన్నారు.
ఒకరి ఆత్మహత్య
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని దుర్కి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. దుర్కి గ్రామంలోని మామిడి బాల్‌రాజు(47)కు గత రెండు సంవత్సరాల క్రితం నుంచి మతి స్థిమితం బాగాలేదు. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స అందించినా నయంకాలేదు. ఈక్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు ఇంటి వెనక గల పాకలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి, మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
కామారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జిల్లాకేంద్రంలోని గుమాస్తా కాలనీకి చెందిన గుమ్మడి రాజేందర్ (69) డెయిరీఫామ్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం డెయిరీఫామ్‌లో పనులు చూసుకుని ఇంటికి వచ్చేందుకు కామారెడ్డి–రామారెడ్డి ప్రధాన రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ బైక్ అతడిని ఢీకొట్టింది. ఈఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య లక్ష్మీపార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు.