
గౌతంనగర్‌లో పోలీసుల తనిఖీలు
60 వాహనాల స్వాధీనం
ఖలీల్‌వాడి: నగరంలోని మూడో పోలీస్ స్టేషన్ పరిధి గౌతంనగర్‌లో బుధవారం రాత్రి సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి సూచన మేరకు ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. 100 మంది పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి పెట్రోలింగ్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, రౌడీ షీటర్లను తనిఖీ చేశారు. ధ్రువపత్రాలు, నంబర్లు లేని దాదాపు 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు పోలీసులని, చట్టాన్ని గౌరవించాలన్నారు. అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలపై సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. కాలనీవాసులు ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం కాలనీవాసుల సూచనలు, సలహాలు స్వీకరించారు. కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస్ రాజ్, రఘుపతి, సురేశ్, మల్లేశ్, భిక్షపతి, శ్రీలత, ఎస్సైలు హరిబాబు, గంగాధర్, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.