
చోరీలకు పాల్పడిన మహిళ అరెస్టు
ఎల్లారెడ్డి: ఇళ్లలో చోరీలకు పాల్పడిన మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్ బుధవారం తెలిపారు. ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని సాతెల్లి గ్రామానికి చెందిన నీరడి మంజుల (45) ఎల్లారెడ్డి పట్టణంలో అనుమానాస్పదంగా నగలు విక్రయించేందుకు రాగా పట్టుకొని విచారించడంతో అసలు విషయం బయటపడిందన్నారు. ఏప్రిల్ 3న అనిత అనే ఇంట్లో చోరికి పాల్పడి బంగారు ముక్కుపుడక దొంగిలించిందని తెలిపారు. ఈ నెల 9న దుద్దుల దుర్గయ్య ఇంట్లో 5 తులాల వెండి, రూ.10 వేల నగదు, మంగళి కిషన్ ఇంట్లో 20 తులాల వెండి, చెవి కమ్మలు, రూ.13 వేల నగదును చోరీ చేసినట్లు పేర్కొన్నారు. తానే ఈ చోరీలకు పాల్పడినట్లు మంజుల ఒప్పుకుందని, ఆమె నుంచి ఒక జత బంగారు కమ్మలు, 20 తులాల వెండి, 5 తులాల వెండి కడియం, రూ.12 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితురాలిని పట్టుకున్న ఎస్సై మహేశ్, పీసీ ఇద్రీస్, హోంగార్డు ప్రసాద్‌లను ఎస్పీ అభినందించినట్లు సీఐ తెలిపారు.