
కౌలు చెల్లించక వేటకు దూరం
నిజాంసాగర్: కౌలాస్ నాలా ప్రాజెక్టులో చేపల వేటకు సంబంధించిన కౌలు ఐదేళ్లుగా చెల్లించకపోవడంతో.. చేపట వేటపై వేలం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో మత్స్యకారులు వేటకు దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టుపై ఆధారపడి తొమ్మిది గ్రామాల మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. కౌలాస్ మత్స్యసంఘం పరిధిలో కౌలాస్, సావర్‌గావ్, లింగంపల్లి, వజ్రకండి, సోపూర్, బాబుల్‌గావ్, విఠల్‌వాడి, చింతల్‌వాడి, డోన్‌గావ్ గ్రామాలున్నాయి. ఈ సంఘంలో 160 మత్స్యకార్మిక కుటుంబాలు సభ్యులుగా ఉన్నాయి. వీరిలో చాలామంది చేపల వేటపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాగా ప్రాజెక్టులో చేపల పెంపకానికి సంబంధించి ఏటా రూ. 72,600 వేల చొప్పున మత్స్యకార్మికులు ప్రభుత్వానికి కౌలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే చేపలు పెంచి, ఉపాధి పొందుతున్న కార్మికులు ఐదేళ్లుగా వివిధ కారణాలతో కౌలు చెల్లించడం లేదు. చేపల వ్యాపారంలో దళారుల పాత్ర పెరగడం, మత్స్యకారులకు కూలి గిట్టుబాటు కాకపోవడం, పలువురు మత్స్యకారులు వేరే పనుల నిమిత్తం వలస వెళ్లడం, ఉన్నవారిలోనూ ఐక్యత లేకపోవడం తదితర కారణాలతో కౌలు చెల్లించడానికి ఐదేళ్లుగా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఐదేళ్లకు సంబంధించి బకాయిలు రూ. 3.63 లక్షలకు చేరా యి. ఈ బకాయిలను చెల్లించాలని మత్స్యకార్మిక సొసైటీ సభ్యులకు మత్స్యశాఖ అధికారులు గతేడాది జూన్‌లో నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ బకాయిలు చెల్లించడానికి సొసైటీ సభ్యులు ముందుకు రాలేదు. ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కౌలాస్ మత్స్య సొసైటీ పరిధిలోని మత్స్యకారులు కౌలాస్ నాలాలో చేపలు వేటాడరాదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా చేపల వేట కోసం వేలం నిర్వహించాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు. దీంతో ఇన్నాళ్లూ ప్రాజెక్టును నమ్ముకుని బతుకుతున్న మత్స్యకారులు ఉపాధికి దూరం కానున్నారు.
కౌలాస్ ప్రాజెక్టులో వేటపై ఆంక్షలు విధించిన అధికారులు
ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు
రేపు వేలం నిర్వహణకు ఏర్పాట్లు
వేలంలో దక్కించుకున్నవారికే వేటకు అవకాశం
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాలతో బుధవారం కౌలాస్ నాలాలో చేపల వేటపై వే లం పాట నిర్వహించాలని నిర్ణయించాం. అచ్చంపేట మత్స్యశాఖ కార్యాలయంలో వేలం ఉంటుంది. ఐదేళ్ల కౌలు బకాయి డబ్బులకు అదనంగా వేలం పాట పాడిన వారికి చేపల వేటను అప్పగిస్తాం. కౌలాస్ మత్స్య సొసైటీ సభ్యులు కౌలు చెల్లించనందున చేపలు పట్టరాదు. పాత సొసైటీ పరిధిలోని గ్రామాల మత్స్యకార్మికులు చేపలు పడితే కేసులు నమోదు చేస్తాం.
– డోలిసింగ్, ఎఫ్‌డీవో, నిజాంసాగర్

కౌలు చెల్లించక వేటకు దూరం