
ఇనుప కూలర్లతో జర భద్రం
నాగిరెడ్డిపేట: ఎండలు తీవ్రమైన నేపథ్యంలో ప్రజలు ఉక్కపోతను భరించలేకపోతున్నారు. ఈ క్రమంలో కూలర్ల వాడకం పెరిగిపోయింది. పేద, మధ్యతరగతి కుటుంబాలు కూలర్లను విరివిగా వినియోగిస్తున్నారు. అయితే ఎక్కువగా ఇనుప కూలర్లను వాడుతున్నారు. తక్కువ ధరకే లభిస్తుండడంతో ఎక్కువగా వీటినే కొనుగోలు చేస్తున్నారు. వీటితో మరో ప్రయోజనం ఏమిటంటే బ్రాండెడ్ కూలర్లకన్నా ఇవి ఎక్కువ గాలిని ఇస్తాయి. దీంతోపాటు ఇళ్లలోని కిటికీల వద్ద అమర్చుకోవడానికి ప్లాస్టిక్ కూలర్ల కంటే ఇనుప కూలర్లే అనుకూలంగా ఉంటాయి. దీంతో ఎక్కువమంది ఇనుప కూలర్ల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. అయితే వీటిని వాడడం ప్రారంభించిన కొంతకాలానికే తుప్పుపడుతుంటాయి. దీంతోపాటు కూలర్‌లోని విద్యుత్‌వైర్లు దెబ్బతిని కూలర్ బాడీకి విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉంటుంది. దీనిని గమనిం చక చాలామంది కూలర్లను అలాగే వినియోగించి విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు. గతేడాది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారులు ఇనుప కూలర్లను తాకి విద్యుదాఘాతానికి గురై మరణించారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది సైతం ఒకరు మృత్యువాతపడ్డారు. రెండు రోజుల క్రితం జుక్కల్ మండలం గుల్లతండాలో తల్లీకూతుళ్లు ఇనుప కూలర్‌తో విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
గుల్ల తండాలో తల్లీ కూతుళ్ల మరణానికి
కారణమైన ఇనుప కూలర్
జాగ్రత్తలు పాటిస్తే మేలు..
ఇనుప కూలర్లను వినియోగించేవారు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాల బారినపడకుండా ఉండవచ్చు. ఇను ప కూలర్లను కొన్నవారు ఒక ఏడాదిపాటు వినియోగించాకా వాటిలోపలి భాగానికి కొత్తగా రంగు వేసుకోవాలి. దీంతోపాటు అందులోని విద్యుత్‌తీగలు సరిగ్గా ఉన్నా యో లేదో సరిచేసుకోవాలి. కూలర్ ఆన్ చే సినప్పుడు కూలర్‌బాడీకి విద్యుత్ సరఫరా అవుతుందేమోనని చెక్ చేసుకోవాలి. వి ద్యుత్ సరఫరా అవుతున్నప్పుడు కూలర్ల సమీపానికి వెళ్లకపోవడం ఉత్తమం.