
ప్రభుత్వ పథకాల్లో అక్రమాలను సహించను
నిజాంసాగర్(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాస్, కల్యాణక్ష్మితో పాటు పలు ప్రభుత్వ పథకాల్లో అక్రమాలను సహించబోనని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సంక్షేమ పథకాలను అమ్ముకునే నాయకులు రాజకీయాల్లో పనికిరారని హెచ్చరించారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్‌లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుతో మహమ్మద్ నగర్ మండలాన్ని ఇండస్ట్రియల్ టౌన్ షిప్‌గా మారుస్తానన్నారు. కొత్తగా ఏర్పాటైన మహమ్మద్ నగర్ మండల దశదిశను మార్చడం తన లక్ష్య మన్నారు. త్వరలోనే మండల కార్యాల యాల ఏర్పాటుకు భూమి పూజ చేస్తామన్నారు. మహమ్మద్ నగర్ మండలానికి 30 వేల మెట్రిక్ టన్నుల గిడ్డంగి మంజరు చేశామని చెప్పారు. రూ. కోటి ఆరవై లక్షలతో సీసీ రోడ్లు వేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 248 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. పథకాల కోసం కార్యకర్తలను, నాయకులు మభ్యపెట్టవద్దన్నారు.
పార్టీ కోసం కష్టపడ్డవారికి గుర్తింపు
కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుర్తింపు లభిస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా గడప గడపకు పథకాలను తీసుకు వెళ్లాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగురవేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పిట్లం వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్‌పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి నాయకులు మల్లయ్యగారి ఆకాష్, సవాయిసింగ్, లోక్యానాయక్, నాగభూషణంగౌడ్, గొట్టం నర్సింలు, ఖాలిక్, రాజు తదితరులున్నారు.
ఇండస్ట్రియల్ టౌన్ షిప్‌గా
మహమ్మద్ నగర్ మండలం
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు