
అశ్రునయనాలతో..
కొవ్వొత్తులతో నివాళి
● పాల్వంచలో గ్రేహౌండ్స్ జవాన్‌కు
అంతిమ వీడ్కోలు
● నివాళులర్పించిన మంత్రి పొన్నం, షబ్బీర్, మదన్‌మోహన్‌రావు
● అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
కామారెడ్డి క్రైం/మాచారెడ్డి : నక్సల్స్ అమర్చిన మందుపాతరకు బలైన గ్రేహౌండ్స్ జవాన్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియలు శుక్రవారం పాల్వంచ మండల కేంద్రంలో అధికార లాంఛనాలతో జరిగాయి. పాల్వంచ గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చి జవాన్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య్యరెడ్డి తదితరులు శ్రీధర్ మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
భారీగా తరలివచ్చిన జనం...
ములుగు జిల్లా కర్రిగుట్టల్లో నక్సల్స్ అమర్చిన మందుపాతర గురువారం ఉదయం పేలడంతో గ్రేహౌండ్స్ జవాన్ వడ్ల శ్రీధర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వరంగల్‌లో పోస్టుమార్టం పూర్తయిన తరువాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహం రాత్రికి పాల్వంచకు చేరుకుంది. శుక్రవారం ఉదయం నుంచే శ్రీధర్ ఇంటికి వేలాది మంది ప్రజలు చేరుకుని కన్నీటి నివాళులర్పించారు. అందరితో కలుపుగొలుగా ఉండే శ్రీధర్ మరణవార్త గ్రామస్తులను కలచివేసింది. ఉదయం గ్రామంలో ఆయన ఇంటి వద్ద ప్రారంభమైన అంతిమయాత్ర ప్రధాన వీధుల మీదుగా సాగింది. శ్రీధర్ స్నేహితులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు, పోలీసులు శ్రీధర్ అమర్‌రహే, జై జవాన్, భారత్‌మాతాకీ జై అంటూ నినదించారు. గ్రామ శివారులోని శ్మశానవాటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. ఆయన సోదరుడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పోలీసులు తుపాకులు పేల్చి గౌరవవందనం చేశాారు. శ్రీధర్ తల్లి లక్ష్మి, భార్య శ్రీవాణిల రోదనలతో అక్కడి వారి హృదయాలు ద్రవించాయి.
అంత్యక్రియలలో గ్రేహౌండ్స్ కమాండర్ (ఆపరేషన్స్) రాఘవేందర్‌రెడ్డి, ఓఎస్‌డీ దయానంద్, డీఎస్పీ శంకరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, పోలీస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
పాల్వంచలో కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న గ్రామస్తులు

అశ్రునయనాలతో..

అశ్రునయనాలతో..

అశ్రునయనాలతో..